మీ కశ్మీర్‌ పర్యటన అద్భుతం

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇటీవల తన కుటుంబంతో కలిసి కశ్మీర్‌లో జరిపిన పర్యటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, దీనిపై ప్రధాని మోదీ స్పందించారు.

Published : 29 Feb 2024 05:13 IST

సచిన్‌ వీడియోకు ప్రధాని స్పందన

దిల్లీ: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ ఇటీవల తన కుటుంబంతో కలిసి కశ్మీర్‌లో జరిపిన పర్యటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, దీనిపై ప్రధాని మోదీ స్పందించారు. సచిన్‌ తన పర్యటనలో ‘ఉజ్వల భారత్‌’ గురించి చాటిచెప్పడం అద్భుతమంటూ ప్రశంసించారు. భార్య అంజలి, కుమార్తె సారా తెందుల్కర్‌తో కలిసి సచిన్‌ కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. స్థానికంగా ఉన్న ఆలయాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. పుల్వామా జిల్లాలోని క్రికెట్‌ బ్యాట్ల తయారీ యూనిట్‌కు వెళ్లారు. పారా క్రికెటర్‌ అమీర్‌ ఇంటికి వెళ్లడం, వీధుల్లో స్థానికులతో కలిసి క్రికెట్‌ ఆడటంతోపాటు జవాన్లతోనూ ముచ్చటించారు. తన పర్యటన వీడియోను బుధవారం ఆయన సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘‘కశ్మీర్‌ పర్యటన నా జ్ఞాపకాల్లో ఎప్పటికీ అందమైన అనుభవంగా మిగిలిపోతుంది. మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయని ప్రధాని మోదీజీ అన్నారు. ఈ పర్యటన తర్వాత ఆయన మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. కశ్మీర్‌ విల్లో బ్యాట్లు.. ‘మేక్‌ ఇన్‌ ఇండియా, మేక్‌ ఫర్‌ వరల్డ్‌’కు గొప్ప ఉదాహరణ. ఇక్కడి బ్యాట్లను ప్రపంచమంతా వాడుతున్నారు. ఈ పర్యటన తర్వాత నేను చెప్పేది ఒక్కటే. ‘ఉజ్వల భారత్‌’ ఆణిముత్యాల్లో ఒకటైన జమ్మూకశ్మీర్‌కు విచ్చేసి.. ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి’’ అని సచిన్‌ రాసుకొచ్చారు. ఈ వీడియోకు ప్రధాని మోదీ స్పందిస్తూ మాస్టర్‌ బ్లాస్టర్‌పై ప్రశంసలు కురిపించారు. ‘‘అద్భుతంగా ఉంది. మీ పర్యటన నుంచి యువత రెండు ముఖ్యమైన అంశాలు తెలుసుకోవాలి. 1.బ్రహ్మాండమైన భారతదేశంలో పలు విభిన్న పర్యాటక ప్రాంతాలు కనుగొనడం. 2.మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాముఖ్యం. మనమంతా కలిసి వికసిత, ఆత్మనిర్భర భారత్‌ను నిర్మిద్దాం’’ అని ప్రధాని పోస్ట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని