భారతీయుల ఊపిరితిత్తులను తీవ్రంగా దెబ్బతీసిన కొవిడ్‌

తీవ్రస్థాయి కొవిడ్‌ బారిన పడిన భారతీయుల్లో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిందని తాజా అధ్యయనం తేల్చింది.

Published : 29 Feb 2024 05:10 IST

దిల్లీ: తీవ్రస్థాయి కొవిడ్‌ బారిన పడిన భారతీయుల్లో ఊపిరితిత్తుల పనితీరు బాగా దెబ్బతిందని తాజా అధ్యయనం తేల్చింది. దాదాపు సగం మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని వెల్లడైంది. ఇది నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది.  వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ నిపుణులు ఈ పరిశోధన చేశారు. ఇందులో భాగంగా 207 మందిని పరిశీలించారు. వారిలో గణనీయ స్థాయిలో ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని గుర్తించారు. వ్యాయామ సామర్థ్యం, జీవన నాణ్యత కూడా తగ్గిపోయిందని తేల్చారు. తీవ్రస్థాయి కొవిడ్‌ నుంచి కోలుకున్న రెండు నెలల తర్వాత కూడా 49.3 శాతం మందికి శ్వాసలో ఇబ్బంది, 27.1 శాతం మందిలో దగ్గు వంటివి కనిపించాయి. ఇతర దేశాల డేటాతో పోల్చినప్పుడు భారతీయుల్లోనే ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. దీనికి నిర్దిష్ట కారణాలు బోధపడటంలేదని పరిశోధకులు తెలిపారు. అయితే భారతీయుల్లో ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తి ఉండొచ్చని చెప్పారు. ఇక్కడ తీవ్ర కొవిడ్‌ బారినపడినవారిలో 72.5 శాతం మందిలో మధుమేహం, అధికరక్తపోటు, దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులు వంటివి ఉన్నట్లు తెలిపారు. రక్తప్రవాహంలోకి వాయువును చేరవేసే ఊపిరితిత్తుల సామర్థ్యం దెబ్బతిందని పరీక్షల్లో వెల్లడైనట్లు వివరించారు. దేశంలో క్షయ వ్యాధి ఉద్ధృతి ఎక్కువగా ఉండటం కూడా దీనికి కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు