సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ అరెస్ట్‌

పశ్చిమ బెంగాల్లో కొన్నాళ్లుగా హింసాత్మక ధర్నాలు, పరస్పర రాజకీయ దూషణలకు కేంద్ర బిందువైన సందేశ్‌ఖాలీ ప్రధాన నిందితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు షాజహాన్‌ షేక్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.

Published : 01 Mar 2024 03:37 IST

సందేశ్‌ఖాలీ: పశ్చిమ బెంగాల్లో కొన్నాళ్లుగా హింసాత్మక ధర్నాలు, పరస్పర రాజకీయ దూషణలకు కేంద్ర బిందువైన సందేశ్‌ఖాలీ ప్రధాన నిందితుడు, తృణమూల్‌ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడు షాజహాన్‌ షేక్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. మహిళలపై లైంగిక వేధింపులు, భూ ఆక్రమణలు, ఈడీ సిబ్బందిపై దాడుల ఆరోపణలు ఎదుర్కొంటున్న షాజహాన్‌ గత 55 రోజులుగా పరారీ ఉన్నాడు. ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖాన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ ఇంట్లో గురువారం తెల్లవారుజామున నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. అనంతరం బసీర్హాట్‌ కోర్టులో హాజరుపరచగా షాజహాన్‌ను 10రోజుల పాటు పోలీస్‌ కస్టడీలో రిమాండ్‌కు అప్పగించేందుకు న్యాయమూర్తి అనుమతించారు. షాజహాన్‌ సన్నిహితుడైన ఆమిర్‌ గాజీని ఒడిశాలోని రవుర్కెలాలో బుధవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిని పశ్చిమబెంగాల్‌కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచగా అయిదు రోజుల పాటు పోలీస్‌ కస్టడీకి అప్పగించేందుకు న్యాయమూర్తి అంగీకరించారు. కేసుల దర్యాప్తు బాధ్యతలను సీఐడీ స్వీకరించింది.  

బెయిల్‌పై సత్వర విచారణకు హైకోర్టు నిరాకరణ

షాజహాన్‌ షేక్‌ అరెస్టైన కొద్దిగంటల సమయంలోనే బెయిల్‌ కోరుతూ అతని తరఫు న్యాయవాది కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌పై సత్వర విచారణ చేపట్టాల్సిందిగా కోర్టును కోరారు. దీనికి నిరాకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.శివజ్ఞానం నేతృత్వంలోని ధర్మాసనం... షాజహాన్‌పై తమకు ఎటువంటి సానుభూతి లేదని పేర్కొంది. బెయిల్‌ పిటిషన్‌తో పాటు కేసును సీబీఐకు బదిలీ చేయాలని వచ్చిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం విచారిస్తామని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని