చాయ్‌ని ఆస్వాదించిన గేట్స్‌

మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత పర్యటనలో చాయ్‌ని ఆస్వాదించారు. సంబంధిత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు.

Updated : 01 Mar 2024 07:13 IST

దిల్లీ: మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ భారత పర్యటనలో చాయ్‌ని ఆస్వాదించారు. సంబంధిత వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. డాలీ చాయ్‌వాలాగా సామాజిక మాధ్యమాల్లో బాగా పేరు సంపాదించిన నాగ్‌పుర్‌ (మహారాష్ట్ర) వాసి సునీల్‌ పాటిల్‌ అందించిన తేనీటిని ఆయన తాగారు. వీడియోను హైదరాబాద్‌లో చిత్రీకరించారు. ‘‘భారత్‌లో ఎక్కడ చూసినా ఆవిష్కరణలు కనిపిస్తాయి. సాధారణ టీ తయారీలో కూడా..’’ అని వీడియోలో గేట్స్‌ పేర్కొన్నారు. ‘వన్‌ చాయ్‌ ప్లీజ్‌’ అని టీని ఆర్డర్‌ చేసిన ఆయన.. డాలీ చాయ్‌వాలా తనదైన శైలిలో తేనీటిని సిద్ధం చేస్తుంటే ఆసక్తిగా తిలకించారు. టీ తాగుతూ.. ‘చాయ్‌ పే చర్చా’ కోసం ఎదురుచూస్తున్నా అని పేర్కొన్నారు. సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు- టీ ఇచ్చేటప్పుడు తాను బిల్‌ గేట్స్‌ను గుర్తుపట్టలేదని సునీల్‌ తెలిపారు. తమ వీడియో వైరల్‌గా మారిన తర్వాతే ఆయన ఎవరో తెలిసిందన్నారు. ఆయనతో వీడియో చిత్రీకరణ కోసమే తనను హైదరాబాద్‌ తీసుకెళ్లారనీ తెలియదని చెప్పారు. ఏదో ఒకరోజు ప్రధాని మోదీకి టీ ఇవ్వాలని ఉందని డాలీ చాయ్‌వాలా తన ఆకాంక్షను వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని