1993 పేలుళ్ల కేసులో అబ్దుల్‌ టుండా నిర్దోషి

లష్కరే తొయిబా ఉగ్రవాది, 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ కరీం ‘టుండా’(81)ను రాజస్థాన్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం నిర్దోషిగా ప్రకటించింది.

Published : 01 Mar 2024 03:38 IST

ప్రకటించిన టాడా కోర్టు

జైపుర్‌: లష్కరే తొయిబా ఉగ్రవాది, 1993 నాటి వరుస బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అబ్దుల్‌ కరీం ‘టుండా’(81)ను రాజస్థాన్‌లోని ప్రత్యేక న్యాయస్థానం గురువారం నిర్దోషిగా ప్రకటించింది. అతడిపై అభియోగాలను రుజువు చేసేందుకు అవసరమైన సాక్ష్యాధారాలను సీబీఐ సమర్పించలేకపోయిందని, దీంతో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిందని అబ్దుల్‌ కరీం తరఫు న్యాయవాది షఫ్క్వాతుల్లా సుల్తానీ తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పూ, హమీదుద్దీన్‌లకు కోర్టు జీవిత ఖైదు విధించినట్లు వెల్లడించారు. కేసు వివరాలు.. 1993 డిసెంబరు 5 అర్ధరాత్రి లఖ్‌నవూ, కాన్పుర్‌, హైదరాబాద్‌, సూరత్‌, ముంబయిల్లోని 5 ప్యాసింజర్‌ రైళ్లలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఆ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఏడాది అవుతున్న నేపథ్యంలో, ప్రతీకారం కోసమే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. అబ్దుల్‌ కరీం, ఇర్ఫాన్‌, హమీదుద్దీన్‌లపై 2021 సెప్టెంబరులో అభియోగాలు నమోదయ్యాయి. అజ్‌మేర్‌లోని ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక(టాడా) కోర్టు విచారణ చేపట్టి తాజాగా తీర్పునిచ్చింది.  దావూద్‌ ఇబ్రహీంకు సన్నిహితుడైన కరీం బాంబుల తయారీలో నైపుణ్యం పొందాడు. ఓసారి బాంబు తయారు చేస్తుండగా పేలడంతో చేతిని కోల్పోయాడు. అప్పట్నుంచి అతణ్ని టుండా(వికలాంగుడు)గా పిలుస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని