సంక్షిప్త వార్తలు (7)

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియాపై నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌ విడుదలకు అడ్డంకులు తొలిగాయి.

Updated : 01 Mar 2024 06:09 IST

ఇంద్రాణీ డాక్యుమెంటరీపై స్టే విధించలేం
బాంబే హైకోర్టు స్పష్టీకరణ

ముంబయి: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియాపై నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ డాక్యుమెంటరీ సిరీస్‌ విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఈ కేసులో విచారణ పూర్తయ్యేవరకూ డాక్యుమెంటరీ విడుదలపై స్టే విధించాలంటూ సీబీఐ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు గురువారం కొట్టివేసింది. విచారణ ప్రక్రియకు వ్యతిరేకంగా అందులో ఎలాంటి దృశ్యాలూ లేవని డాక్యుమెంటరీని ప్రత్యేకంగా వీక్షించిన ధర్మాసనం అభిప్రాయపడింది. విచారణ కొనసాగుతున్న కేసుల గురించి మీడియాలో చర్చించడం కొత్తేమీ కాదని, వాటిపై సెన్సార్‌ విధించలేమని పేర్కొంది.


అతి స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం

దిల్లీ: అత్యాధునిక ‘అతి స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థ’ క్షిపణిని భారత్‌ తాజాగా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలోని చాందీపుర్‌ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి బుధ, గురువారాల్లో ఈ ప్రయోగ పరీక్షల్ని నిర్వహించినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. అధిక వేగంతో దూసుకెళ్తున్న మానవరహిత లక్ష్యాలను ఈ క్షిపణులు కచ్చితత్వంతో ఛేదించాయని తెలిపింది.


దిల్లీలో అత్యుత్తమ వాయునాణ్యత

దిల్లీ: తొమ్మిదేళ్లలో ఈసారి ఫిబ్రవరి నెలలో దిల్లీ అత్యుత్తమ వాయు నాణ్యతను నమోదు చేసినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) నివేదిక వెల్లడించింది. ఈ ఫిబ్రవరిలో ఎక్కువరోజులపాటు ఈ నాణ్యత సూచీ 200 కంటే దిగువనే ఉందని తెలిపింది. దిల్లీలో ఫిబ్రవరిలో 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని, 2013 నుంచి ఇదే అత్యధికమని తెలిపింది.


సీబీఐ విచారణకు అఖిలేశ్‌ గైర్హాజరు

లఖ్‌నవూ: అక్రమ మైనింగ్‌ కేసులో సీబీఐ విచారణకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ గైర్హాజరయ్యారు. ఆ కేసులో సాక్ష్యం చెప్పేందుకు గురువారం దిల్లీలోని తమ కార్యాలయానికి రావాల్సిందిగా సీబీఐ నోటీసు జారీ చేసింది. ‘‘ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల కారణంగా అఖిలేశ్‌ విచారణకు హాజరుకాలేకపోయారు’ అని సమాజ్‌వాదీ వర్గాలు తెలిపాయి.


మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం 14 మంది మృతి

దిండోరి: మధ్యప్రదేశ్‌ దిండోరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ట్రక్‌ అదుపు తప్పి లోతైన లోయలో పడిపోవడంతో 14 మంది అక్కడిక్కడే మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. బాధితులంతా మసుర్‌ఘర్గీలో జరిగిన ఓ వేడుక నుంచి అమ్హాయి దేవ్రీ గ్రామానికి తిరిగి వస్తుండగా గురువారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.


రైతు మరణంపై హత్య కేసు

చండీగఢ్‌: పంజాబ్‌, హరియాణా సరిహద్దులోని ఖనౌరీవద్ద ఫిబ్రవరి 21వ తేదీన జరిగిన ఘర్షణల్లో రైతు శుభకరణ్‌ సింగ్‌ మృతి చెందడంపై గురువారం పంజాబ్‌ ప్రభుత్వం హత్య కేసు నమోదు చేసింది. ఆ రోజున రైతులకు, భద్రతా బలగాలకు జరిగిన ఘర్షణలో బఠిండాకు చెందిన 21ఏళ్ల శుభకరణ్‌ చనిపోగా 12 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఆందోళనల సందర్భంగా విధ్వంసానికి పాల్పడ్డ రైతుల పాస్‌పోర్టులను, వీసాలను రద్దు చేయించాలని హరియాణా పోలీసులు చూస్తున్నారు.


సెనెగల్‌లో మునిగిన బోటు
24 మంది వలస జీవుల మృతి

డాకర్‌(సెనెగల్‌): పశ్చిమాఫ్రికా దేశం సెనెగల్‌లో వలస జీవులు వెళ్తున్న బోటు మునిగిపోవడంతో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరికొందరు గాయపడినట్లు పేర్కొన్నారు. స్పెయిన్‌కు వెళ్తుండగా సెయింట్‌ లూయిస్‌ పట్టణం సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని