ప్రపంచంలో మన పరపతి పెరిగింది

తమ పదేళ్ల పాలనలో భారతదేశ పరపతి అన్నివిధాలా పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు.

Published : 01 Mar 2024 04:34 IST

పెట్టుబడులకు విదేశాలు ముందుకు వస్తున్నాయి
మూడో అతిపెద్ద వ్యవస్థను చేయడమే ధ్యేయం
మధ్యప్రదేశ్‌లో మోదీ వెల్లడి

భోపాల్‌: తమ పదేళ్ల పాలనలో భారతదేశ పరపతి అన్నివిధాలా పెరిగిందని, పెట్టుబడులు పెట్టేందుకు విదేశాలు ముందుకు వస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశాన్ని నిలబెట్టే ధ్యేయంతో ఈసారి లోక్‌సభ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలిపారు. గురువారం మధ్యప్రదేశ్‌లో రూ.17,551 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీడియో సదస్సు ద్వారా ప్రసంగించారు. తమ పాలనలో సాధించిన అభివృద్ధితో ప్రపంచదేశాలన్నీ భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటున్నాయని చెప్పారు. భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడా ఎంతో మర్యాద పొందుతున్నారని, పెట్టుబడుల రూపంలో దేశానికి అది ఎంతో మేలు చేస్తోందని తెలిపారు. ముఖ్యంగా పర్యాటక రంగం ప్రయోజనం పొందుతోందన్నారు. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల మార్కును దాటేస్తుందనే మాట ప్రతిచోటా వినిపిస్తోందని, ఇప్పుడది ప్రజా నినాదంగా మారిపోయిందని చెప్పారు.

సంప్రదాయ రంగాలను భ్రష్టు పట్టించారు

యూపీయే పదేళ్లలో 40 లక్షల హెక్టార్ల సాగుభూములకు నీరందిస్తే తాము 90 లక్షల హెక్టార్లకు ఇచ్చామని మోదీ తెలిపారు. ఆటవస్తువుల తయారీ నుంచి సంప్రదాయ రంగాలను యూపీయే సర్కారు భ్రష్టుపట్టించిందని, తాము దానిని సరిచేశామని చెప్పారు. కుటీర పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తులను ప్రపంచ దేశాధినేతలకు కానుకగా ఇస్తూ తాను వాటికి ప్రచారం కల్పిస్తున్నానని వివరించారు. రాబోయే అయిదేళ్లలో మహిళల సాధికారత అనూహ్య స్థాయికి చేరుతుందని విశ్వాసం వ్యక్తపరిచారు. ప్రపంచంలో తొలిసారిగా.. భారతీయ పంచాంగం ప్రకారం పనిచేసే ‘విక్రమాదిత్య వైదిక గడియారా’న్ని ఉజ్జయిని నగరంలో ఆయన ప్రారంభించారు. రెవెన్యూ న్యాయస్థానం తీర్పులు ఈమెయిల్‌, వాట్సప్‌ ద్వారా లభ్యమయ్యేలా ‘సైబర్‌ తహసీల్‌’ ప్రాజెక్టును కూడా ఆవిష్కరించారు. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ జయంతిని పురస్కరించుకుని మోదీ ఆయనకు నివాళులర్పించారు. నిజాయతీ, నిరాడంబర జీవితానికి ఆయన నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.

భారత్‌కు సహజ భాగస్వామి మారిషస్‌

భారత్‌ సమకూర్చిన నిధులతో మారిషస్‌లో నిర్మించిన వైమానిక స్థావరం, జెట్టీ, ఇతర ప్రాజెక్టులను ఆ దేశ ప్రధాని ప్రవిండ్‌ జగన్నాథ్‌తో కలిసి మోదీ ప్రారంభించారు. భారత్‌కు మారిషస్‌ సహజ భాగస్వామి అని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రంలో ఎదురవుతున్న సవాళ్లపై భారత ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారు. తమదేశ సార్వభౌమత్వ హక్కులను వదులుకునేందుకు గానీ, భూభాగాన్ని సైనిక స్థావరంగా వాడుకునేందుకు గానీ అనుమతించేది లేదని ప్రవిండ్‌ స్పష్టంచేశారు.


నేడు, రేపు మరిన్ని ప్రారంభోత్సవాలు

ప్రధాని మోదీ శుక్రవారం పశ్చిమ బెంగాల్‌లో రూ.22,200 కోట్ల పైచిలుకు అభివృద్ధి పనుల్ని, ఝార్ఖండ్‌లో రూ.35,700 కోట్ల పనుల్ని; శనివారం బిహార్‌లో రూ.1.83 లక్షల కోట్ల పనుల్ని ప్రారంభిస్తారు. రెండు చోట్లా బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు.

వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో భాగంగా గత మూడున్నర నెలల్లో పీఎం కిసాన్‌లో కొత్తగా 90 లక్షల మంది లబ్ధి పొందినట్లు, ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని