వేగవంతమైన స్వదేశీ క్వాంటమ్‌ కంప్యూటర్‌

గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

Published : 02 Mar 2024 04:20 IST

రూపొందిస్తున్న ఐఐటీ పరిశోధకులు

దిల్లీ: గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే తొలి స్వదేశీ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది ఫోటాన్లను ఉపయోగించుకొని, వేగంగా లెక్కలు కడుతుందని వారు తెలిపారు. జాతీయ క్వాంటమ్‌ మిషన్‌లో భాగంగా ఈ ప్రాజెక్టును వారు చేపట్టారు. సంప్రదాయ అల్గోరిథమ్‌లు లేకుండానే ఇది డేటాను విశ్లేషించి, 86 శాతం కచ్చితత్వంతో పరిష్కార మార్గాలను చూపుతుంది.

ఐఐటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న ఆప్టికల్‌ క్వాంటమ్‌ కంప్యూటర్‌కు ఫీచర్‌ లెర్నింగ్‌తోపాటు సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించే సామర్థ్యం ఉంటుంది. ‘‘అధునాతన యూజర్‌ ఇంటర్‌ఫేస్‌, క్వాంటమ్‌ సిమ్యులేటర్‌, క్వాంటమ్‌ ప్రాసెసింగ్‌ సామర్థ్యాల కారణంగా మా కంప్యూటర్‌ సీపీయూలా కాకుండా గ్రాఫిక్స్‌ ప్రాసెసర్‌ (జీపీయూ)లా వ్యవహరిస్తుంది. వీడియోలు లేదా ఫొటోలు వంటి ఇన్‌పుట్‌ను నిరంతరం ప్రాసెస్‌ చేస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకుంటున్న సి.ఎస్‌.యాదవ్‌ తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు క్వాంటమ్‌ కంప్యూటర్లను  తయారుచేస్తున్నాయని వివరించారు. అవి ‘జోసెఫ్‌సన్‌ జంక్షన్‌ క్యుబిట్‌’లతో తయారవుతున్నాయని తెలిపారు. వాటికి శీతల వాతావరణం ఉండాలని చెప్పారు. తాము మాత్రం సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద పనిచేసే ఫోటాన్‌ ఆధారిత క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారుచేయాలనుకుంటున్నట్లు వివరించారు. ఏకకాలంలో 1,024 లక్ష్యాలను చేపట్టగలిగేలా దాన్ని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన మూడు కీలక భాగాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని