ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ భేటీ

భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

Updated : 02 Mar 2024 06:02 IST

దిల్లీ: భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ప్రజా శ్రేయస్సు కోసం కృత్రిమ మేధ, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో ఆవిష్కరణలు, మహిళల భాగస్వామ్యంతో అభివృద్ధి తదితర అంశాలను చర్చించారు. మోదీని కలవడం ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని బిల్‌ గేట్స్‌ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. దానిపై స్పందించిన మోదీ.. ఇది నిజంగా అద్భుతమైన సమావేశమని పేర్కొన్నారు. భూగ్రహాన్ని మెరుగుపరిచేలా, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది వ్యక్తులను శక్తిమంతం చేసే రంగాల గురించి చర్చించడం ఆనందంగా ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రమంత్రులు జైశంకర్‌, మన్‌సుఖ్‌ మాండవీయలతోనూ బిల్‌ గేట్స్‌ భేటీ అయ్యారు. ఆరోగ్యం, విద్య, మహిళల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై చర్చించారు. ఆరోగ్య మైత్రి, క్యూబ్‌ భీష్మ్‌ వంటి డిజిటల్‌ హెల్త్‌ ఆవిష్కరణలను ఆయన ప్రశంసించారు. పిల్లల పోషణ, శ్రేయస్సు కోసం కేంద్రం అమలు చేస్తున్న పోషణ్‌ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా ఉందని పేర్కొన్నారు.

ఐక్యతా విగ్రహ సందర్శన

ఏక్తా నగర్‌: గుజరాత్‌లోని నర్మదా జిల్లా ఏక్తా నగర్‌లో ఉన్న ఐక్యతా విగ్రహాన్ని బిల్‌ గేట్స్‌ శుక్రవారం సందర్శించారు. 182 అడుగుల ఆ సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఓ ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించారు. ఆతిథ్యానికి ధన్యవాదాలని సందర్శకుల పుస్తకంలో రాశారు. విగ్రహం నిర్మించిన తీరును అధికారులు ఆయనకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని