కులం, మతం, భాష పేరుతో ఓట్లడగొద్దు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు శుక్రవారం ఎన్నికల కమిషన్‌ కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దని సూచించింది.

Published : 02 Mar 2024 04:23 IST

భక్తులు, దైవ సంబంధాలను అవమానించొద్దు
పార్టీలకు ఎన్నికల సంఘం సూచన

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు శుక్రవారం ఎన్నికల కమిషన్‌ కొన్ని సూచనలు, హెచ్చరికలు చేసింది. కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లు అడగవద్దని సూచించింది. భక్తులు, దైవ సంబంధాలను అవమానించవద్దని స్పష్టం చేసింది. గతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిని మందలించి వదిలేసే వారమని, ఈ సారి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పార్టీలు, నేతలు, అభ్యర్థులు, స్టార్‌ క్యాంపెయినర్లు నియమావళిని కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ‘దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించొద్దు. గతంలో నోటీసులు అందుకున్న ఉల్లంఘనులపై ఈసారి కఠిన చర్యలుంటాయి. ప్రచారంలో పార్టీలు మర్యాద పాటించాలి. ఈ విషయంలో స్టార్‌ క్యాంపెయినర్లకు ఎక్కువ బాధ్యత ఉంది. వాస్తవాలకు విరుద్ధంగా ఎటువంటి ప్రకటనలు చేయకూడదు. ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదు. సామాజిక మాధ్యమాల్లోనూ ప్రత్యర్థులను కించపరిచేలా పోస్టులు పెట్టకూడదు. నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలి. మహిళల గౌరవానికి, పరువుకు భంగం కలిగించే హేయమైన వ్యాఖ్యలు, చర్యలకు దూరంగా ఉండాలి. ధ్రువీకరణ కాని, తప్పుదోవ పట్టించే ప్రచార ప్రకటనలను మీడియాలో ఇవ్వకూడదు. వార్తా కథనాల మాటున ప్రచార ప్రకటనలు ఇవ్వకూడదు’ అని ఎన్నికల సంఘం సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని