సంక్షిప్త వార్తలు(5)

కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించే వరకూ దిల్లీ చలో ఆగబోదని, తమ తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని రైతు నేతలు తెలిపారు.

Updated : 02 Mar 2024 06:00 IST

దిల్లీ చలో ఆగదు
రేపు తదుపరి కార్యాచరణ: రైతు నేతలు

చండీగఢ్‌: కనీస మద్దతు ధరకు చట్టబద్ధ హామీతోపాటు ఇతర డిమాండ్లను పరిష్కరించే వరకూ దిల్లీ చలో ఆగబోదని, తమ తదుపరి కార్యాచరణను ఆదివారం ప్రకటిస్తామని రైతు నేతలు తెలిపారు. శంభు, ఖనౌరీలవద్ద తమ బలాన్ని మరింత పెంచుకుంటామని, దబ్వాలీలో రైతులు ధర్నా చేస్తారని చెప్పారు. శంభు సరిహద్దు వద్ద శుక్రవారం రైతు నేతలు మంజీత్‌ సింగ్‌ రాయ్‌, జశ్వీందర్‌ సింగ్‌ లోంగోవాల్‌ మీడియాతో మాట్లాడారు. శాంతియుత నిరసనలపై కేంద్రం, హరియాణా ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయని ఆరోపించారు. బాష్పవాయు గోళాలు, లాఠీఛార్జిలతో తమకు ఇబ్బంది లేదని, కానీ విష వాయువులను భద్రతా సిబ్బంది ప్రయోగిస్తున్నారని, దానివల్లే యువ రైతు శుభకరణ్‌ సింగ్‌ మరణించారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో తుపాకీ గుళ్లను ప్రయోగించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. ‘మా ఆందోళన కొనసాగుతుంది. అది విజయం సాధించడం ఖాయం. మా పిల్లలను తుపాకీ గుళ్ల నుంచి కాపాడుకుంటాం’ అని స్పష్టం చేశారు.


పార్లమెంటు భద్రత విభాగ అధిపతిగా అనురాగ్‌ అగర్వాల్‌

దిల్లీ: పార్లమెంటు భద్రత విభాగ అధిపతిగా ఐపీఎస్‌ అధికారి అనురాగ్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన జాయింట్‌ సెక్రటరీ(సెక్యూరిటీ) పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు మునుపు జాయింట్‌ సెక్రటరీగా విధులు నిర్వహించిన రఘుబీర్‌ లాల్‌ తిరిగి ఆయన కేడర్‌కు వెళ్లడంతో అక్టోబర్‌ 20 నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన అనురాగ్‌.. 1998 బ్యాచ్‌ అధికారి. ప్రస్తుతం ఆయన సీఆర్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. డిసెంబరు 13న లోక్‌సభలో ఇద్దరు వ్యక్తులు సందర్శకుల గ్యాలరీ నుంచి దూకి పొగగొట్టాలతో గందరగోళం సృష్టించిన తర్వాత పార్లమెంటు ప్రాంగణ భద్రతపై సందేహాలు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో అనురాగ్‌ జాయింట్‌ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు.


లోపభూయిష్ట పట్టణీకరణతో అక్రమ నిర్మాణాలు

దిల్లీ: పట్టణీకరణ విధానాల్లో లోపాలున్నాయని, ప్రజలకు అందుబాటు ధరలకు గృహ వసతి కల్పనలో ప్రభుత్వ వైఫల్యం అక్రమ నిర్మాణాలకు దారితీస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పట్టణాలకు పెరుగుతున్న వలసలను దృష్టిలో ఉంచుకుని ఆర్థికంగా బలహీనవర్గాలకు గృహ వసతి కల్పించలేకపోతున్నామని గుర్తు చేసింది. దిల్లీ అభివృద్ధి ప్రాధికార సంస్థకు (డీడీఏ) తన భూముల్లో 60-70 శాతం ఎక్కుడున్నాయో తెలియదని, అవన్నీ కబ్జా అయ్యాయని సుప్రీం పేర్కొంది. లఖ్‌నవూలోని అక్బర్‌నగర్‌లో వాణిజ్య సముదాయాలను కూల్చి వేయడంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తూ సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. వాణిజ్య భవనాలతోపాటు ఇళ్లనూ కూల్చి వేస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. నదీ తీరంలోని ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయని, ఫిబ్రవరి 27న ప్రారంభమైన కూల్చివేత కార్యక్రమంపై స్టే ఇవ్వడానికి అలహాబాద్‌ హైకోర్టు నిరాకరించిందని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కె.ఎం.నటరాజ్‌ సుప్రీంకు వివరించారు. అయితే హైకోర్టు తన తీర్పును నిలిపి ఉంచిందని తెలియజేశారు. హైకోర్టు తీర్పు వెలువడేవరకూ కూల్చివేతను ఆపాలని సుప్రీంకోర్టు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది.


తండ్రీకూతుళ్ల బంధాన్ని చెడగొట్టాలనుకోవడం క్రూరత్వమే: దిల్లీ హైకోర్టు

దిల్లీ: భర్తపై ద్వేషంతో తండ్రీ కూతుళ్ల బంధాన్ని దూరం చేసేలా భార్య ప్రవర్తించడం క్రూరత్వం కిందకే వస్తుందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఓ కేసులో భర్తకు విడాకులు మంజూరు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. భార్యాభర్తల మధ్య ఎంతటి విభేదాలున్నా అందులోకి పిల్లలను లాగకూడదని తెలిపింది. ‘‘ఒక వ్యూహంతో తన కుమార్తెతో పాటు భర్త ఇంటికి భార్య వెళ్లింది. భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు చేసింది. తండ్రిపై కుమార్తె మనసులో విషబీజాలు నాటేలా చేసింది’’ అని న్యాయస్థానం పేర్కొంది.


మన ప్రయాణానికి మరింత బలం

దేశంలో మూడు సెమీకండక్టర్‌ యూనిట్ల ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలపడం హర్షణీయం. సాంకేతిక రంగంలో సాధికారత సాధన దిశగా మన పరివర్తనాత్మక ప్రయాణాన్ని ఈ యూనిట్లు మరింత బలోపేతం చేస్తాయి. అంతర్జాతీయ సెమీకండక్టర్ల తయారీ కేంద్రంగా భారత్‌ అవతరించేందుకు దోహదపడతాయి.

నరేంద్ర మోదీ


యూపీలో ఇదీ పరిస్థితి!

ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఇచ్చేవన్నీ ఆటవిక రాజ్యం గ్యారంటీలే. యూపీలోని ఐఐటీ-బీహెచ్‌యూ ప్రాంగణంలో ఓ మహిళపై భాజపా సభ్యులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆ రాష్ట్రంలో ఇటీవల ఓ మహిళా జడ్జి.. న్యాయం జరగక బలవన్మరణానికి పాల్పడ్డారు. పదో తరగతి పరీక్ష రాసి వస్తూ ఓ దళిత విద్యార్థిని హత్యకు గురైంది. తాజాగా ఇద్దరు అత్యాచార బాధిత బాలికలు విగతజీవులై చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఇదీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి!

రాహుల్‌ గాంధీ


పదేళ్ల అన్యాయ కాలం!

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) తుది పరిష్కార క్లెయిముల తిరస్కరణ రేటు పెరిగిపోతోంది. అది 2017-18లో దాదాపు 13 శాతంగా ఉండగా, 2022-23లో 34 శాతానికి చేరుకుంది. ఇది తీవ్ర ఆందోళనకరం. గత పదేళ్ల ‘అన్యాయ కాలం’లో ఏ ఒక్క వర్గానికీ సముచిత లబ్ధి చేకూరలేదు. మహిళలకు ఉద్యోగాలు లేవు. యువతకు ఉపాధి కరవైంది. రైతుల పంటలకు తగిన ధరలు లభించడం లేదు. ఉద్యోగులు తాము కష్టపడి సంపాదించుకున్న పీఎఫ్‌ నిధులనూ సులువుగా పొందలేకపోతున్నారు.

జైరాం రమేశ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని