బెట్టింగ్‌ సొమ్ము విదేశాలకు.. ఆపై స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి

మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్‌ కేంద్రంగా హవాలా ముఠాను నిర్వహించే హరిశంకర్‌ టిబరేవాల్‌ అనే వ్యక్తి బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులతో కలసి భారీ స్థాయిలో మోసాలకు తెరలేపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు గుర్తించారు.

Updated : 02 Mar 2024 05:59 IST

మహదేవ్‌ యాప్‌ కుంభకోణంలో కొత్త కోణం
రూ.580 కోట్ల సెక్యూరిటీలను స్తంభింపజేసిన ఈడీ

దిల్లీ: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దుబాయ్‌ కేంద్రంగా హవాలా ముఠాను నిర్వహించే హరిశంకర్‌ టిబరేవాల్‌ అనే వ్యక్తి బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులతో కలసి భారీ స్థాయిలో మోసాలకు తెరలేపినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు గుర్తించారు. బెట్టింగ్‌ యాప్‌ ద్వారా కొల్లగొట్టిన సొమ్మును హవాలా మార్గంలో విదేశాలకు తరలించి, అక్కడి నుంచి స్టాక్‌మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 28న కోల్‌కతా, గురుగ్రామ్‌, దిల్లీ, ఇందౌర్‌, ముంబయి, రాయ్‌పుర్‌ నగరాల్లో తనిఖీలు నిర్వహించగా హరిశంకర్‌ బాగోతం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అతడికి చెందిన రూ.580 కోట్ల విలువైన సెక్యూరిటీలను స్తంభింపజేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు మరో రూ.3.64 కోట్ల విలువైన నగదు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకొన్నట్లు పేర్కొన్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్‌ కేంద్రంగా పనిచేసే హరిశంకర్‌ స్వస్థలం కోల్‌కతా. ఇతడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మహదేవ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రశేఖర్‌, రవి ఉప్పల్‌తో చేతులు కలిపాడు. సొంతంగా స్కై ఎక్ఛేంజ్‌ పేరిట మరో బెట్టింగ్‌ యాప్‌ను నిర్వహించేవాడు. దాని అనుబంధ సంస్థల్లో తన అనుచరులను డైరెక్టర్లుగా నియమించి హవాలా కార్యకలాపాలకు వినియోగించేవాడు. రెడ్డి అన్న, ఫైర్‌ప్లే లాంటి ఎన్నో బెట్టింగ్‌ యాప్‌లనూ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహించాడు. ఈ కుంభకోణం నుంచి సంపాదించిన మొత్తంలో యాప్‌ ప్రమోటర్లు కొంత మొత్తాన్ని ఛత్తీస్‌గఢ్‌లోని నాయకులు, అధికారులకు లంచాల రూపంలో సమర్పించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కుంభకోణం మొత్తం విలువ రూ.6 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని