మూడు మీడియా ఛానళ్లకు ఎన్‌బీడీఎస్‌ఏ జరిమానా

విద్వేషాలు, మత కలహాలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలను ప్రసారం చేసిన కొన్ని మీడియా ఛానళ్లపై ‘న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీడీఎస్‌ఏ)’ కొరడా ఝళిపించింది.

Published : 02 Mar 2024 05:11 IST

దిల్లీ: విద్వేషాలు, మత కలహాలను రెచ్చగొట్టేలా కార్యక్రమాలను ప్రసారం చేసిన కొన్ని మీడియా ఛానళ్లపై ‘న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అండ్‌ డిజిటల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ (ఎన్‌బీడీఎస్‌ఏ)’ కొరడా ఝళిపించింది. జరిమానా విధించడంతోపాటు ఆ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలను ఆన్‌లైన్‌ నుంచి తొలగించాలని ఆదేశించింది. ‘లవ్‌ జిహాద్‌’ పేరిట విద్వేషపూరిత కథనాల ప్రసారంపై ఇంద్రజీత్‌ ఘోర్‌పడే అనే సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు చర్యలు చేపట్టింది. టైమ్స్‌నౌ నవభారత్‌కు రూ.లక్ష, న్యూస్‌ 18 ఇండియాకు రూ.50 వేల చొప్పున జరిమానా విధించింది. రామ నవమి సందర్భంగా చోటుచేసుకున్న హింస గురించి ప్రసారం చేసిన కథనంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నందుకు ఆజ్‌ తక్‌ను ఎన్‌బీడీఎస్‌ఏ హెచ్చరించింది. తమ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ ఛానళ్ల నుంచి సంబంధిత వీడియోలను ఏడు రోజుల్లోగా తొలగించాలని ఆ మూడు ఛానళ్లను ఎన్‌బీడీఎస్‌ఏ అధ్యక్షుడు జస్టిస్‌(రిటైర్డ్‌) ఎ.కె.సికరీ ఆదేశించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి శిక్ష పడిన వార్తను ప్రసారం చేస్తూ ఆజ్‌ తక్‌ ఛానల్‌ కల్పిత వీడియోలో ఓ దొంగను చూపించడంపై యూత్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ బి.వి.శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. దీనిపై ఆజ్‌తక్‌ను ఎన్‌బీడీఎస్‌ఏ హెచ్చరించింది. సంబంధిత వీడియోలను యూట్యూబ్‌ ఛానల్‌ నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. దీంతోపాటు భారత్‌లో మైనారిటీల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలను ఖలిస్థానీ వేర్పాటువాదులకు ముడిపెడుతూ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు ఆజ్‌తక్‌కు రూ.75 వేల జరిమానా విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని