క్యాన్సర్‌ చికిత్సకు కాపర్‌-రెస్‌వెరట్రాల్‌ ప్రత్యామ్నాయం కాదు

కాపర్‌, రెస్‌వెరట్రాల్‌ మిశ్రమం.. కీమోథెరపీ వంటి చికిత్సల్లో దుష్ప్రభావాలను తగ్గించే వీలుందని భారత శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.

Published : 03 Mar 2024 03:27 IST

ముంబయి: కాపర్‌, రెస్‌వెరట్రాల్‌ మిశ్రమం.. కీమోథెరపీ వంటి చికిత్సల్లో దుష్ప్రభావాలను తగ్గించే వీలుందని భారత శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. టాటా మెమోరియల్‌ సెంటర్‌ (టీఎంసీ) శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. చనిపోయే క్యాన్సర్‌ కణాలు సెల్‌-ఫ్రీ క్రొమాటిన్‌ రేణువుల (సీఎఫ్‌సీహెచ్‌పీ)ను వెలువరిస్తాయని వీరి పరిశీలనలో వెల్లడైంది. ఇవి ఆరోగ్యకర కణాలు క్యాన్సర్‌ కణాలుగా మార్చేస్తాయి. ఈ నేపథ్యంలో మృత క్యాన్సర్‌ కణాలను వెలువరించే కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలు.. క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమవుతాయా అన్నది పరిశీలించారు. ఇందుకోసం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న ఎలుకల్లోకి గ్రాఫ్టింగ్‌ ద్వారా మానవ రొమ్ము క్యాన్సర్‌ కణాలను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆ మూషికాలపై కీమోథెరపీ, రేడియోథెరపీ, శస్త్రచికిత్సలను ప్రయోగించారు. అందులో సగం ఎలుకలకు సీఎఫ్‌సీహెచ్‌పీలను నాశనం చేసే మందులను ఇచ్చారు.  ఈ మూషికాల మెదళ్లలో మానవ డీఎన్‌ఏ(సీఎఫ్‌సీహెచ్‌పీలు), క్యాన్సర్‌ ప్రొటీన్లు కనిపించాయి. చికిత్స తర్వాత వాటి సంఖ్య పెరిగినట్లు గుర్తించారు. సీఎఫ్‌సీహెచ్‌పీలను నిర్వీర్యం చేసే మందులను పొందిన ఎలుకల మెదళ్లలో ఇవి తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. నిర్దిష్ట నిష్పత్తిలో కాపర్‌, రెస్‌వెరట్రాల్‌ను ప్రయోగించినప్పుడు సీఎఫ్‌సీహెచ్‌పీలు తగ్గుతున్నట్లు తేల్చారు. శస్త్రచికిత్స, రేడియోథెరపీ, కీమోథెరపీ, హార్మోన్‌ థెరపీ వంటి వాటికి ఈ ఔషధ మిశ్రమం ప్రత్యామ్నాయం కాదని పరిశోధకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని