ఆ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి మినహాయింపు ఉంటుందా!

పార్లమెంటు, శాసనసభల్లో సభ్యులు ఒక ప్రసంగం చేయడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకుంటే దానిపై నేర విచారణ ఎదుర్కొనే విషయంలో వారికి చట్టపరమైన మినహాయింపు ఉంటుందా అనే కీలక అంశంపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.

Published : 03 Mar 2024 03:29 IST

రేపు కీలక తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

దిల్లీ: పార్లమెంటు, శాసనసభల్లో సభ్యులు ఒక ప్రసంగం చేయడానికి లేదా ఓటు వేయడానికి లంచం తీసుకుంటే దానిపై నేర విచారణ ఎదుర్కొనే విషయంలో వారికి చట్టపరమైన మినహాయింపు ఉంటుందా అనే కీలక అంశంపై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించనుంది. వాదనల సందర్భంగా కేంద్రం.. లంచానికి రక్షణ కల్పించడం సరికాదని, పార్లమెంటు సభ్యులు చట్టానికి అతీతులు కాదని తెలిపింది. పీవీ నరసింహరావు వర్సెస్‌ స్టేట్‌ కేసు(1998)లో రాజ్యాంగంలోని సెక్షన్‌ 105(2) ప్రకారం ఎంపీలకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. 2012లో రాజ్యసభ ఎన్నికల సమయంలో నాటి ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా ఎమ్మెల్యే సీతా సోరెన్‌.. లంచం తీసుకొని ఓటు వేశారని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె అధికరణ 194(2) ప్రకారం శాసనసభలో ఓటువేసే శాసనసభ్యుడికి చట్టపరమైన రక్షణ ఉంటుందని వాదించారు. ఆమె వాదనను హైకోర్టు తిరస్కరించింది. దీంతో సీతా సోరెన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును గత ఏడాది సెప్టెంబరులో ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ నివేదించారు. విచారణ జరిగింది. వాదోపవాదాలు జరిగాయి. ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు అక్టోబరు 5న ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని