సంక్షిప్త వార్తలు (6)

జైలులో ఉన్న ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించడానికి అయిన ఖర్చును ఆయన నుంచి వసూలు చేయవద్దంటూ శనివారం దిల్లీ కోర్టు ఆదేశించింది.

Updated : 03 Mar 2024 06:10 IST

ఆ ఖర్చును సిసోదియా నుంచి వసూలు చేయకండి: దిల్లీ కోర్టు

దిల్లీ: జైలులో ఉన్న ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించడానికి అయిన ఖర్చును ఆయన నుంచి వసూలు చేయవద్దంటూ శనివారం దిల్లీ కోర్టు ఆదేశించింది. పూర్తిగా మానవతా ప్రతిపాదికన ఈ ఆదేశాలను జారీచేసినట్లు ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె.నాగ్‌పాల్‌ స్పష్టంచేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను తన సొంత ఖర్చులతో వారానికోసారి పరమర్శించడానికి ఫిబ్రవరి 5 సిసోదియాకు దిల్లీకోర్టు వీలు కల్పించిన విషయం తెలిసిందే. సిసోదియా ఒక్కో పరామర్శకు రూ.40 వేలు, నెలకు రూ.2 లక్షల ఖర్చును అధికారులు చూపుతున్నారని, దీనిని సవరించాలని నిందితుని తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. అభ్యర్థనను పరిశీలించిన కోర్టు సిసోదియా పరామర్శ ఖర్చును రాష్ట్ర ఖజానా నుంచి తీసుకోవాలని స్పష్టంచేసింది. సిసోదియాతోపాటు సంజయ్‌సింగ్‌కు ఈ నెల 7 వరకు పొలీసు కస్టడీని పొడిగిస్తున్నట్లు తెలిపింది.


అమిత్‌షాపై రాహుల్‌ అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ 13కు వాయిదా

సుల్తాన్‌పుర్‌: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన 2018 నాటి పరువునష్టం కేసు విచారణ ఈనెల 13కు వాయిదా పడింది. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రతో రాహుల్‌ బిజీగా ఉన్నారని, ఆయనకు మరికొంత సమయం కావాలంటూ ఆయన తరఫు న్యాయవాది కాశీ ప్రసాద్‌ శుక్లా కోరడంతో న్యాయస్థానం విచారణను వాయిదావేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఫిబ్రవరి 20న హాజరైన రాహుల్‌ గాంధీకి సుల్తాన్‌పుర్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి వాదనలు ఈ నెల 2న వింటామని చెప్పింది. 2018లో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ మాట్లాడుతూ..‘రాజకీయాల్లో స్వచ్ఛంగా, నిజాయితీగా ఉంటామని చెప్పుకునే భాజపా.. ఓ హత్య కేసులో నిందితుడిని పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకుంది’ అని ఆరోపించారు. ఆ సమయంలో అమిత్‌షా భాజపా జాతీయాధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో రాహుల్‌పై భాజపా నేత విజయ్‌ మిశ్రా పరువునష్టం దావా వేశారు.


రెమిషన్‌ రద్దుపై సుప్రీంకోర్టులో బిల్కిస్‌ బానో దోషుల పిటిషన్‌

దిల్లీ: సంచలనాత్మకమైన బిల్కిస్‌ బానో కేసులో ముద్దాయిలుగా ఉన్నవారిలో ఇద్దరు మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. తమ శిక్షాకాలాన్ని తగ్గించడం (రెమిషన్‌ ఇవ్వడం) చెల్లదంటూ జనవరి 8న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాధేశ్యాం భగవాన్‌దాస్‌ షా, రాజూభాయ్‌ బాబూలాల్‌ సోని సవాల్‌ చేశారు. ఇలాంటి వివాదాలను తుది తీర్పు నిమిత్తం విస్తృత ధర్మాసనానికి నివేదించాలని 2002లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఇది ఉందని పేర్కొన్నారు. రెమిషన్‌కు తాము గతంలో చేసిన దరఖాస్తును పరిశీలించాలని ఒక ధర్మాసనం, శిక్ష తగ్గింపుపై నిర్ణయం తీసుకునే అధికారం మహారాష్ట్రకే తప్పితే గుజరాత్‌కు లేదని మరో ధర్మాసనం తీర్పు చెప్పాయన్నారు.


దక్షిణాఫ్రికాలో ఎన్‌ఐఏకు చిక్కిన గ్యాంగ్‌స్టర్‌

దిల్లీ: భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ నేరస్థులలో ఒకరైన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎఫ్‌ఐ) గ్యాంగ్‌స్టర్‌ మహ్మద్‌ గౌస్‌ నియాజీ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. దక్షిణాఫ్రికాలో అతడిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇతడు 2016లో బెంగళూరుకు చెందిన రాష్టీయ్ర స్వయంసేవక్‌ సంఘ్‌(అరెస్సెస్‌) నేత రుద్రేష్‌ను హత్య చేశాడు. అప్పటినుంచి విదేశాల్లో తలదాచుకుంటున్నాడు. అతడి కదలికలపై నిఘా ఉంచిన గుజరాత్‌ ఉగ్రవాద వ్యతిరేక బృందం నియాజీ జాడను గుర్తించి ఎన్‌ఐఏకు సమాచారమిచ్చింది. 2016లో సంఘ్‌ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతున్న రుద్రేష్‌ను బెంగళూరులోని శివాజీనగర్‌లో దుండగులు హత్య చేశారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ నియాజీని పట్టించినవారికి రూ.5 లక్షల రివార్డును ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు అరెస్టయ్యారు.


ఖర్గే, జైరాం రమేశ్‌లకు గడ్కరీ లీగల్‌ నోటీసులు

నాగ్‌పుర్‌: కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌లకు కేంద్ర మంత్రి, భాజపా సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీ లీగల్‌ నోటీసులు పంపారు. ఓ వీడియో ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా దురద్దేశంతో ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయంగా గందరగోళం సృష్టించి భాజపాలో విభజన తెచ్చేలా వారి చర్య ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా నుంచి 24 గంటల్లో ఆ వీడియోను తొలగించి, లిఖితపూర్వంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘ఇప్పుడు గ్రామాల్లో సరైన రోడ్లు, తాగు నీటి సౌకర్యం, ఆసుపత్రులు, పాఠశాలలు లేవు. రైతులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు’ అని గడ్కరీ చెప్పినట్లుగా ఆ వీడియోలో ఉంది.


భారత్‌లో తయారీపై ఉదాసీనత

‘భారత్‌లో తయారీ’ కలను సాకారం చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఎంతో కృషి చేసినట్లు భాజపా నేతలు గొప్పలు చెప్పుకొంటున్నా, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. 2020 కల్లా ఆ రంగంలో 10 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైంది? కీలక రంగాల్లో ఉత్పత్తికి కేటాయించిన నిధులను కూడా ఎందుకు వినియోగించలేక పోయారు? ఇప్పటికీ చైనా నుంచి దిగుమతులు ఎందుకు పెరుగుతున్నాయి?

మల్లికార్జున ఖర్గే


మహిళా కార్మికులపై వివక్ష ఎందుకు?

అభివృద్ధి చెందు తున్న దేశాల్లో వ్యవ సాయ కార్మికుల్లో 43 శాతం మంది మహిళలే ఉన్నారు. కానీ ప్రపంచ సంపద, భూముల యాజమాన్యంలో వారి వాటా చాలా తక్కువగా ఉంది. ఈ అసమానత తొలగాలి. మహిళల కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలి. వారికి సంపదపై హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వాల చొరవ ఒక్కటే సరిపోదు. సమాజ దృక్పథంలోనూ మార్పు రావాలి. మహిళల సాధికారతతోనే సమగ్ర ప్రగతి సాధ్యం.      

 ఐరాస అభివృద్ధి కార్యక్రమం


వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సూత్రాలివీ..

మిమ్మల్ని ఇతరులు బలవంతంగా మార్చక ముందే మీరే మారండి. మిమ్మల్ని మీరు బాగా తెలుసుకోవడానికి సమ యాన్ని వెచ్చించండి. ఓపిక, పట్టుదలతో పని చేయండి. గడువులోపు పని పూర్తిచేయడాన్ని అలవర్చుకోండి. మీరు ఒకటి పొందాలంటే, మరొకటి ఇవ్వాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి. కష్టపడి పనిచేసేవారినే అదృష్టం వరిస్తుంది. ఏ విషయాన్నైనా నేర్చుకోవాలంటే శ్రద్ధగా వినడం అలవాటు చేసుకోండి. 

 హర్ష్‌ గోయెంకా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని