వర్షాలు లేక పెరిగిన కర్బన ఉద్గారాలు

అధిక జీడీపీ వృద్ధిరేటు, బలహీన రుతుపవనాల వల్ల 2023లో భారత్‌లో అదనంగా 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది.

Published : 03 Mar 2024 04:15 IST

దిల్లీ: అధిక జీడీపీ వృద్ధిరేటు, బలహీన రుతుపవనాల వల్ల 2023లో భారత్‌లో అదనంగా 19 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. వర్షాలు సరిగా కురవకపోవడంతో జల విద్యుదుత్పత్తి తగ్గింది. విద్యుత్తుకు గిరాకీ పెరిగి శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఉద్గారాల పెరుగుదలకు అది దారితీసింది. భారతదేశ తలసరి ఉద్గారాలు ఇప్పటికీ ప్రపంచ సగటుకన్నా తక్కువేనని వివరించింది.  నిరుడు చైనాలో అత్యధికంగా 56.5 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడ్డాయి. అక్కడ తలసరి ఉద్గారాలు సంపన్న దేశాలకన్నా 15 శాతం ఎక్కువ. 2023లో ప్రపంచంలో ఇంధన సంబంధ కర్బన ఉద్గారాలు 41 కోట్ల టన్నుల మేర పెరిగి రికార్డు స్థాయిలో 37.4 గిగా టన్నులకు చేరాయి. 2019 నుంచి 2023 వరకు ప్రపంచంలో ఇంధన సంబంధ ఉద్గారాలు 90 కోట్ల టన్నుల మేర పెరిగాయి. 2019 నుంచి సౌర, పవన, అణు విద్యుదుత్పాదన, విద్యుత్తు కార్ల వాడకం పెరగడం శుభపరిణామమనీ, లేకుంటే ఉద్గారాలు మూడు రెట్లు పెరిగేవని ఐఈఏ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని