హిమాచల్‌, కశ్మీర్‌లో దట్టమైన మంచు, భారీ వర్షాలు

హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లలో భారీ వర్షాలు, తీవ్ర మంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పెద్ద సంఖ్యలో రహదారులను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Published : 03 Mar 2024 04:16 IST

350కి పైగా రహదారుల మూసివేత

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌లలో భారీ వర్షాలు, తీవ్ర మంచు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. పెద్ద సంఖ్యలో రహదారులను మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హిమాచల్‌లో లాహౌల్‌, స్పితి సహా మరికొన్ని ప్రాంతాల్లో దట్టమైన మంచు కారణంగా నాలుగు జాతీయ రహదారులు సహా 350 రోడ్లను మూసివేశారు. మరోవైపు రాష్ట్రంలో మైదాన ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన భారీ వర్షాలు ఆదివారం వరకూ కొనసాగనున్నట్లు వాతావరణ విభాగం హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో కనీసం 1,314 ట్రాన్స్‌ఫార్మర్లు పని చేయడం లేదని అధికారులు తెలిపారు. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో శనివారం పర్వత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మంచు కురుస్తుండగా.. మైదాన ప్రాంతాల్లో భారీ వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. గుల్‌మార్గ్‌లోని స్కై రిసార్ట్‌, సోనామార్గ్‌, దూధ్‌పత్రిలలో మంచు కురుస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షం కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడటంతో జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. రహదారిపై అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. బలమైన గాలులు వీయటంతో అనంత్‌నాగ్‌ జిల్లాలో అనేక నిర్మాణాలు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. నౌగమ్‌ గ్రామంలో ఇళ్ల పైకప్పులు, దుకాణాలు దెబ్బతిన్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని