ముస్లిమేతర మైనారిటీలకు పౌరసత్వం

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగురోజుల్లో షెడ్యూలు వస్తుందనగా.. భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటికి తీసింది.

Updated : 12 Mar 2024 12:26 IST

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ కాందిశీకులకు వర్తింపు
అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం-2019
ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్‌
మండిపడిన విపక్షాలు
అంగీకరించేది లేదంటున్న మమత, విజయన్‌

ఈనాడు, దిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) మళ్లీ తెరపైకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నాలుగురోజుల్లో షెడ్యూలు వస్తుందనగా.. భాజపాకు ఓట్లు కురిపిస్తుందని భావిస్తున్న సీఏఏను మోదీ సర్కారు బ్రహ్మాస్త్రంలా బయటికి తీసింది. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి భారత్‌కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మనదేశ పౌరసత్వాన్ని కల్పించడం లక్ష్యంగా సోమవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. సీఏఏ చట్టం-2019లోనే  పార్లమెంటు ఆమోదం పొందినా.. రాష్ట్రపతి సమ్మతి కూడా లభించినా. .. విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా అమలులో జాప్యం జరిగింది. పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో ఆ చట్టం కార్యరూపం దాల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పలుమార్లు చెబుతూ వచ్చారు. సరిగ్గా అదనుచూసి ఇప్పుడు దానిని తెరపైకి తెచ్చారు.

ఏమిటీ నిబంధనలు?

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఈ నిబంధనల్ని కేంద్రం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు,   పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది. కేంద్ర నిర్ణయంపై విపక్షాలన్నీ భగ్గుమన్నాయి. కొందరి పట్ల వివక్ష చూపేలా ఉంటే దీనిని అమలుచేయబోమని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌లు తెగేసిచెప్పారు. అల్లర్లు చెలరేగవచ్చనే అనుమానంతో పలు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

తొలగనున్న అడ్డంకులు

పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చినవారికి చట్టపరంగా పౌరసత్వం దక్కనున్నందున వారికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల తరబడి కాందిశీకుల్లా బతుకుతున్నవారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వారి సంస్కృతి, భాష, సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది. దేశంలో ఎక్కడికైనా రాకపోకలు సాగించొచ్చు. ఆస్తులు కొనవచ్చు.

  • పైన పేర్కొన్న 3 దేశాల్లో హింసకు గురవుతూ భారత్‌లో తప్పితే ప్రపంచంలో మరెక్కడా ఆశ్రయం పొందలేనివారికి రక్షణ కల్పించడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్లు కేంద్రం చెబుతోంది. బయటి నుంచి వచ్చినవారికి పౌరసత్వం ఇస్తుందేగానీ భారతీయ పౌరుల పౌరసత్వాన్ని రద్దు చేయదు. 
  • మతపరమైన వేధింపులను తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది. ఆ ప్రకారం 2019లోనే సీఏఏ కోసం ప్రయత్నం జరిగినా అనేక అపోహలు తెరపైకి రావడంతో దాని అమలులో ఇన్నాళ్లు ఆలస్యమైనట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. కొవిడ్‌-19 కూడా ఒక ప్రధాన కారణమంది. 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పుడు చట్టపరంగా పూర్తిచేసినట్లు భాజపా పేర్కొంది. ప్రధాని మోదీ మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుని, రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షల్ని నెరవేర్చారని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు.

రెండు చట్టాల నుంచి మినహాయింపు

నూతన చట్టం ప్రకారం మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఆరు మతాల వారిని చట్టవ్యతిరేక వలసదారులుగా గుర్తించరు. ఈ చట్టం కింద ప్రయోజనం పొందడానికి వీలుగా వారిని విదేశీయుల చట్టం- 1946, పాస్‌పోర్ట్‌ (ఎంట్రీ ఇన్‌ టు ఇండియా) చట్టం- 1920 నుంచి మినహాయించారు.

  • ప్రస్తుతం ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల పరిధిలోకి వచ్చేవారు రిజిస్ట్రేషన్‌ ద్వారాకానీ, సహజసిద్ధం (నాచురలైజేషన్‌)గా కానీ భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పౌరసత్వ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దరఖాస్తుదారుల నుంచి పత్రాలేమీ అడగరు. పౌరసత్వం మంజూరుకు 30 జిల్లాల కలెక్టర్లకు, 9 రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఇదివరకే అధికారాలిచ్చారు. అస్సాం, పశ్చిమబెంగాల్‌లలో సున్నిత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అక్కడ మాత్రం ఏ జిల్లా అధికారులకూ ఇలాంటి అధికారం ఇవ్వలేదు.
  • సీఏఏ కింద భారత పౌరసత్వాన్ని కోరుతూ వచ్చే దరఖాస్తులపై నిర్ణయం తీసుకునే సాధికార కమిటీకి జనాభా లెక్కల డైరెక్టర్‌ నేతృత్వం వహిస్తారు.

అక్రమ వలస కేసుల మూసివేత

సాధారణ పరిస్థితుల్లో పౌరసత్వం పొందాలంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందు కనీసం 11 ఏళ్లపాటు భారత్‌లో నివసించాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వ సర్వీసులలో పనిచేయాలి. అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మాత్రం నివాస అర్హతను అయిదేళ్ల కాలానికి కుదించింది. ఒకసారి వీరికి పౌరసత్వం దక్కితే వారు భారత్‌లో ప్రవేశించిన నాటినుంచి భారతీయ పౌరులుగానే గుర్తిస్తారు. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు. చట్టం పరిధిలో ముస్లిమేతరులనే ప్రస్తావించడంపై గతంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఇందులో 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

పాక్‌ హిందూ శరణార్థుల హర్షం

సీఏఏ-19 అమలుతో ఎట్టకేలకు తాము భారతీయ పౌరులం అవుతున్నామని దిల్లీలో ఉంటున్న పాకిస్థానీ హిందూ శరణార్థులు హర్షం వ్యక్తంచేశారు. ఎన్నోఏళ్లుగా దీనికోసమే నిరీక్షిస్తున్నామని వారి ప్రతినిధి ధరంవీర్‌ సోలంకి చెప్పారు. సోమవారం సాయంత్రం ఈశాన్య దిల్లీ, షాహీన్‌బాగ్‌, జామియానగర్‌ వంటి సున్నితమైన ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైనా సైబర్‌ విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అస్సాంలో ‘ఆసు’ సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. సీఏఏ ప్రతుల్ని కాల్చివేసి, మంగళవారం హర్తాళ్‌ పాటించాలని పిలుపునిచ్చాయి.


ఒకసారి మురిగిపోయింది

సీఏఏ బిల్లును వాస్తవానికి కేంద్రం 2016లోనే తీసుకొచ్చింది. దానిని ‘సంయుక్త పార్లమెంటరీ సంఘం’ పరిశీలనకు పంపించగా అది 2019 జనవరి 7న నివేదిక ఇచ్చింది. ఆ మరుసటి రోజే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారు. 16వ లోక్‌సభ పదవీకాలం ముగియడంతో ఆ బిల్లు మురిగిపోయింది. 17వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత 2019 డిసెంబరులో ఉభయసభల్లో ఈ బిల్లును ఆమోదింపజేశారు. ఇది రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చిన అస్సాం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు, ‘బెంగాల్‌ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973’ కింద నోటిఫై చేసిన ‘ద ఇన్నర్‌లైన్‌’కు ఇది వర్తించదని చట్టంలో పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని