ఎన్నికల బాండ్ల వివరాలు ఈసీ చేతికి

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి అందజేసింది.

Published : 13 Mar 2024 03:48 IST

సుప్రీంకోర్టు ఆదేశాలతో అందజేసిన ఎస్‌బీఐ

దిల్లీ: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) మంగళవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి అందజేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. ఈ నెల 15 సాయంత్రం 5గంటల్లోగా ఈసీ కూడా ఈ సమాచారాన్ని వెబ్‌సైట్‌లో బహిరంగపరచాల్సి ఉంటుంది. ఎన్నికల బాండ్ల వివరాలను ప్రకటించేందుకు జూన్‌ 30 వరకు సమయం కోరుతూ ఎస్‌బీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం సోమవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ తీరుపై ఈ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం... మంగళవారం ఈసీ కార్యాలయ పని వేళలు ముగిసేలాగా ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం ఆదేశాలను నిర్దేశిత సమయంలోగానే ఎస్‌బీఐ పాటించింది. ఎన్నికల బాండ్ల వివరాలు తమకు అందిన విషయాన్ని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ద్వారా ఈసీ నిర్ధారించింది.
కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో దాదాపు 28వేల బాండ్లను ఎస్‌బీఐ విక్రయించింది. వీటి మొత్తం విలువ రూ.16,518 కోట్లు. అయితే, ఎన్నికల బాండ్ల పథకం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉందని పేర్కొంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎన్నికల బాండ్లు చట్టవిరుద్ధమైనవంటూ ఫిబ్రవరి 15న ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.

ఎస్సీబీఏ అధ్యక్షుడి అసాధారణ లేఖ

ఎన్నికల బాండ్ల వివరాలను బహిరంగపరచాలన్న రాజ్యాంగ ధర్మాసనం తీర్పు అమలుకాకుండా అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు, అఖిల భారత బార్‌ అసోసియేషన్‌ (ఏఐబీఏ) ఛైర్‌పర్సన్‌ ఆదిశ్‌ అగర్వాల్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ లేఖ రాశారు. రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చిన కార్పొరేట్‌ సంస్థల వివరాలను వెల్లడించడం వల్ల ఆయా సంస్థలను వేధింపులకు గురిచేయడానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వ్యాపార సంస్థల ప్రతిష్ఠను కూడా ఇది దెబ్బతీస్తుందన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తనకున్న అసాధారణ అధికారాల ద్వారా సుప్రీంకోర్టు తీర్పును పునఃపరిశీలించేలా సిఫార్సు చేయాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు. అప్పటి వరకూ తీర్పు అమలుకాకుండా నిలిపి ఉంచాలన్నారు. తద్వారా భారత పార్లమెంటు, రాజకీయ పార్టీలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రజలకు సంపూర్ణ న్యాయం చేకూరుతుందని పేర్కొన్నారు.


ఇప్పుడేం జరుగుతుంది?

రాష్ట్రపతికి ఎస్సీబీఏ అధ్యక్షుడు రాసిన లేఖ ఓ అసాధారణ పరిస్థితికి దారితీసింది. దేశ ప్రాధాన్యం గల ఏదైనా అంశంపైన, న్యాయపరమైన మీమాంస తలెత్తిన సందర్భాల్లో సుప్రీంకోర్టు సలహా, సూచనలను రాష్ట్రపతి కోరవచ్చు. రాజ్యాంగంలోని అధికరణం 143 అటువంటి అధికారాన్ని కల్పించింది. అయితే, ఎస్సీబీఏ అధ్యక్షుడి లేఖను పరిశీలించాలని సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి నేరుగా పంపించకపోవచ్చని నిపుణుల అభిప్రాయం. ఆ లేఖను కేంద్ర మంత్రి మండలి పరిశీలనకు సిఫారసు చేయవచ్చు లేదంటే పక్కన పడేయవచ్చు. కేబినెట్‌కు పంపినట్లయితే అక్కడ ఆమోదం పొంది వచ్చిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి దానిని సుప్రీంకోర్టుకు రిఫర్‌ చేయటానికి వీలవుతుందని అంటున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని