General elections: నేను ఫలానా వారి భార్యను!

భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు చిత్రమైన సమస్య ఎదురైంది.

Updated : 20 Mar 2024 07:04 IST

తొలి లోక్‌సభ ఎన్నికల్లో సొంత పేర్లు చెప్పని మహిళా ఓటర్లు
1951-52లో ఎన్నికల కమిషన్‌కు ఎదురైన విచిత్ర పరిస్థితి
28 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగింపు

దిల్లీ: భారతదేశంలో మొట్టమొదటిసారి 1951-52లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌కు చిత్రమైన సమస్య ఎదురైంది. ఓటర్ల జాబితాలు తయారు చేసేటప్పుడు మహిళలు తమ అసలు పేర్లు చెప్పకుండా ఫలానా వ్యక్తి భార్యననో, కుమార్తెననో చెప్పసాగారు. స్థానిక ఆచారాలు, సంప్రదాయాలే ఈ పరిస్థితికి కారణం. ఇలాంటి కేసులన్నీ బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్య భారత్‌, రాజస్థాన్‌, వింధ్య ప్రదేశ్‌లలోనే ఎదురయ్యాయి. అప్పట్లో దేశంలోని మహిళా ఓటర్ల సంఖ్య 8 కోట్లు కాగా, వారిలో 28 లక్షల మంది సొంత పేర్లు చెప్పకుండా భర్తలు, తండ్రుల పేర్లు చెప్పడంతో వారి పేర్లను ఓటరు జాబితాల నుంచి తొలగించారు. దానికి ముందు సొంత పేర్లు చెప్పడానికి మహిళా ఓటర్లకు నెల రోజుల వ్యవధి ఇచ్చారు. దీన్ని బిహార్‌లో చాలామంది సద్వినియోగం చేసుకోగా, రాజస్థాన్‌ మహిళలు మాత్రం పేర్లు చెప్పడానికి ముందుకురాలేదు. దీంతో అలాంటి మహిళలు మొత్తం 28 లక్షల మంది పేర్లను గడువు ముగిసిన తరవాత తొలగించారు.

నేడు పురుషులను మించి..

పితృస్వామ్య సమాజం నీడ నుంచి స్త్రీలను విముక్తం చేయడానికి ఎన్నికల కమిషన్‌ ప్రాధాన్యమివ్వడం వల్లనే మహిళా ఓటర్లు సొంత పేర్లు చెప్పాలని పట్టుబట్టింది. 1950లో భారత్‌ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించడానికి ఒక రోజు ముందు ఏర్పడిన ఎన్నికల సంఘం ఇంతవరకు 17 లోక్‌సభ ఎన్నికలు నిర్వహించింది. మొదటిసారి ఎన్నికలు నిర్వహించేటప్పుడు భౌగోళిక, జనవర్గ పరంగా పలు సవాళ్లను ఎదుర్కొంది. అప్పట్లో అత్యధిక జనాభా నిరక్షరాస్యులు కావడం పెద్ద సమస్య. నాడు పేరు చెప్పడానికే సంకోచించిన మహిళా ఓటర్లు నేడు పురుషులను మించి పోలింగ్‌లో పాల్గొంటున్నారు.

12 రాష్ట్రాల్లో ‘ఆమె’దే ఆధిక్యం

1951-52 లోక్‌సభ ఎన్నికల్లో జమ్మూకశ్మీర్‌ మినహా యావత్‌ దేశంలో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 45 శాతం మంది మహిళా ఓటర్లే. 2019లో మొత్తం ఓటర్ల సంఖ్య 91.1 కోట్లకు చేరగా, వారిలో మహిళల సంఖ్య 43.85 కోట్లు, పురుష ఓటర్ల సంఖ్య 47.34 కోట్లు. తొలి లోక్‌ సభ ఎన్నికల్లో మహిళల కోసం 27,527 ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో 67.4 శాతం మంది ఓటర్లు పాల్గొనగా, వారిలో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్య కాస్త ఎక్కువ. ఆ ఎన్నికల్లో 67.18 శాతం మంది స్త్రీలు, 67.01 శాతంమంది పురుషులు ఓటు వేశారు. 2024 లోక్‌ సభ ఎన్నికల్లో 47.1 కోట్లమంది మహిళా ఓటర్ల పేర్లు నమోదయ్యాయి. 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే కాస్త ఎక్కువ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని