కుదిపేస్తున్న దిల్లీ మద్యం కుంభకోణం

మద్యం కుంభకోణం ఇప్పుడు దిల్లీ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల ముంగిట భారాస ఎమ్మెల్సీ కవిత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ల అరెస్టుతో దేశం దృష్టి దీనిపైకి మళ్లింది.

Updated : 22 Mar 2024 09:18 IST

ఈనాడు, దిల్లీ: మద్యం కుంభకోణం ఇప్పుడు దిల్లీ, తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఎన్నికల ముంగిట భారాస ఎమ్మెల్సీ కవిత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ల అరెస్టుతో దేశం దృష్టి దీనిపైకి మళ్లింది. చిల్లర, టోకు వర్తకులు అధిక లాభాలు పొందేలా 2021-22 ఆర్థిక సంవత్సరంలో దిల్లీ ప్రభుత్వ మద్యం విధానాన్ని తయారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై 2022 ఆగస్టు 17న సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. అందులో అప్పటి ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియాపై ‘అవినీతి నిరోధక చట్టం’ కింద కేసు దాఖలైంది. కేంద్ర హోంశాఖ డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పాయ్‌ ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ కేసు నమోదుచేసింది. సిసోదియా, అప్పటి ఎక్సైజ్‌ కమిషనర్‌ అర్వ గోపికృష్ణ, డిప్యూటీ కమిషనర్‌ ఆనంద్‌ తివారీ, సహాయ కమిషనర్‌ పంకజ్‌ భట్నాగర్‌లు కలిసి- ముడుపులు ఇచ్చిన కొందరు ప్రైవేటు వ్యక్తులకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి మద్యం విధానాన్ని రూపొందించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఇందులో ఎమ్మెల్సీ కవితను ప్రధాన కుట్రదారుగా చూపింది.

అనుకూలంగా చేయించుకున్నారన్న దర్యాప్తు సంస్థలు

సౌత్‌గ్రూప్‌లోని శరత్‌చంద్రారెడ్డి, మాగుంట రాఘవ్‌, మాగుంట శ్రీనివాసులురెడ్డిలతో కలిసి కుట్రపన్ని ఆప్‌ అగ్రనేతలకు ముడుపుల రూపంలో రూ.100 కోట్లు ఇచ్చి, దిల్లీ మద్యం విధానం తమకు అనుకూలంగా ఉండేలా తయారుచేయించుకున్నారని ఈడీ, సీబీఐలు పేర్కొన్నాయి. కేజ్రీవాల్‌తో కవిత ఒప్పందం చేసుకున్న తర్వాత మధ్యవర్తులు, దళారుల ద్వారా అప్పటి ఎక్సైజ్‌ మంత్రి సిసోదియాకు ముడుపులు ముట్టజెప్పినట్లు రిమాండ్‌ నివేదికలో ఈడీ పేర్కొంది. ముడుపులు ముట్టజెప్పినందుకుగాను ఆప్‌ నేతలు ఆమెకు మద్యం విధాన రూపకల్పనలోని అంశాలను చెప్పడంతోపాటు, అందులో ఆమెకు అనుకూలమైన నిబంధనలు పొందుపరచడానికి అంగీకరించినట్లు ఈడీ తెలిపింది. అరుణ్‌ పిళ్లై ద్వారా ఆమె ఇండోస్పిరిట్స్‌ సంస్థలో వాటా పొందడంతోపాటు, దేశంలో అతిపెద్ద మద్యం వ్యాపార సంస్థ అయిన పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన మద్యం పంపిణీ వ్యాపారంలోనూ భాగస్వామ్యం పొందారని పేర్కొంది. అది దిల్లీ మద్యం వ్యాపారంలో ఇండోస్పిరిట్స్‌ సంస్థకు అత్యధిక లాభాలు పొందేలా చేసిందన్నది అభియోగం. ఆప్‌ నేతలకు చెల్లించిన ముడుపులను వీరు లాభాల రూపంలో తిరిగి రాబట్టుకున్నారని ఈడీ చెబుతోంది.

ఖజానాకు రూ.2,873 కోట్ల నష్టం

మద్యం వ్యాపారులంతా దొడ్డిదారిలో సిండికేట్‌గా ఏర్పడి టోకు వర్తకులు 12%, చిల్లర వర్తకులు 185% లాభం పొందేలా విధానాన్ని రూపొందించినట్లు సీబీఐ పేర్కొంది. టోకు వర్తకులు పొందే 12% లాభాల్లో 6% మొత్తాన్ని ముడుపుల రూపంలో ఆప్‌ నేతలకు తిరిగి చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపించింది. టోకు వ్యాపారులకు 5% మార్జిన్‌ ఇవ్వాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసినా దాన్ని 12%కి పెంచడంవల్ల దిల్లీ ఖజానాకు రూ.581 కోట్ల నష్టం వాటిల్లినట్లు సీబీఐ లెక్కతేల్చింది. దిల్లీలోని రిటైల్‌జోన్ల కేటాయింపునకు నిర్వహించిన వేలంలో రూ.7,029 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా రూ.5,037 కోట్లు మాత్రమే వచ్చినట్లు తెలిపింది. మద్యం విధానంలో లోపాలవల్ల ఖజానాకు మొత్తంగా రూ.2,873 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ ఇప్పటివరకు 31 మంది నిందితులపై 5 ఛార్జిషీట్లు, ఆరు అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేసింది. 16 మందిని అరెస్టు చేసింది. సీబీఐ కూడా అయిదుగురిని అరెస్టు చేసింది.

కేజ్రీవాల్‌ వారసత్వం ఎవరికి దక్కేనో!

అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు కావడంతో ఆప్‌ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీ సారథ్యాన్ని వహించేది ఎవరు, ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది. విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారిణి అయిన కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌, దిల్లీ కేబినెట్‌ మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. 2012లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కన్వీనర్‌గా ఉంటున్న కేజ్రీవాల్‌ ఇప్పటివరకు మూడుసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఒంటిచేత్తో పార్టీని నడిపించి దేశంలో మూడో అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయికి ఆప్‌ని తీసుకువెళ్లారు. లోక్‌సభ ఎన్నికల ముంగిట ఆయన అరెస్టు కావడంతో వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి. కేసులో ఒకవేళ అరెస్టయితే కేజ్రీవాల్‌ సీఎంగా రాజీనామా చేయాలా అని గత డిసెంబరులోనే ఆప్‌ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రాజీనామా అవసరం లేదని, ఎక్కడినుంచైనా ఆయనే పాలన సాగించాలని 90% మంది అభిప్రాయపడ్డారు. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ రాజకీయాల్లోకి వచ్చిన కేజ్రీవాల్‌ గత దశాబ్దకాలం నుంచి కేంద్ర సర్కారును ఢీకొంటున్నారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌తోనూ పలుమార్లు ఘర్షణ పడ్డారు. ఆయనకు విశ్వసనీయంగా ఉండే సంజయ్‌సింగ్‌, సిసోదియాలు మద్యం కేసులో ఇప్పటికే జైల్లో ఉన్నారు. సత్యేందర్‌ జైన్‌ మరో కేసులో జైలుకు వెళ్లారు.


పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎం

ముఖ్యమంత్రిగా పదవిలో ఉండగా అరెస్టయిన తొలి సీఎం కేజ్రీవాల్‌ కావడం గమనార్హం. సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత అరెస్టయినవారి జాబితాలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (బిహార్‌), జయలలిత (తమిళనాడు), ఓం ప్రకాశ్‌ చౌటాలా (హరియాణా); మధు కోడా, హేమంత్‌ సోరెన్‌ (ఝార్ఖండ్‌) వంటి నేతలు ఉన్నారు.

లాలు ప్రసాద్‌ యాదవ్‌: 1990-1997 మధ్య బిహార్‌ ముఖ్యమంత్రిగా లాలు ప్రసాద్‌ యాదవ్‌ ఉన్నారు. దాణా కుంభకోణం కేసులో ఆయనతోపాటు మాజీ సీఎం జగన్నాథ్‌ మిశ్రను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన లాలు.. బెయిల్‌పై బయటకు వచ్చారు.
జయలలిత: 1991-2016 మధ్య పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కలర్‌ టీవీల కొనుగోళ్లలో అవకతవకలకు సంబంధించిన కేసులో 1996 డిసెంబరు 7న అరెస్టయ్యారు. అప్పుడు నెలరోజుల పాటు జైలులో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

ఓంప్రకాశ్‌ చౌటాలా: 1989-2005 మధ్య హరియాణా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో పదేళ్ల శిక్ష పడింది. అనంతరం అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.

మధు కోడా: 2006-2008 మధ్య ఝార్ఖండ్‌ సీఎంగా చేసిన మధు కోడా.. మైనింగ్‌ కేసులో 2009లో అరెస్టయ్యారు.

హేమంత్‌ సోరెన్‌: 2013-2024 మధ్య ఝార్ఖండ్‌ సీఎంగా పనిచేసిన హేమంత్‌ సోరెన్‌.. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ ఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అంతకుముందే సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్‌ నేత, చంపయీ సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని