నాలుగు చిలుకలకు రూ.444 టికెట్‌!

స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్‌ తీసుకోవాల్సి వచ్చింది.

Published : 28 Mar 2024 05:55 IST

వైరల్‌ అవుతున్న కేఎస్‌ఆర్‌టీసీ తీరు

బెంగళూరు, న్యూస్‌టుడే: స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్‌ తీసుకోవాల్సి వచ్చింది. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ) బస్సులో తమ యజమానితో ప్రయాణిస్తున్న నాలుగు చిలుకలకు ఓ కండక్టర్‌ రూ.444ల టికెట్‌ కొట్టాడు. ప్రస్తుతం ఈ టికెట్‌ సామాజిక మాధ్యమంలో వైరల్‌ అవుతోంది. వివరాలివి.. బుధవారం ఉదయం బెంగళూరు నుంచి మైసూరుకు బయలుదేరిన ఓ మహిళ తన మనవరాలితో పాటు నాలుగు చిలుకలున్న బుట్టతో కేఎస్‌ఆర్‌టీసీ బస్సు ఎక్కారు. ప్రభుత్వ పథకాల్లో ఒకటైన ‘శక్తి’ ద్వారా వారిద్దరికీ ఉచిత టికెట్‌ ఇచ్చిన కండక్టర్‌.. ఈ నాలుగు చిలుకలను బాలలుగా పరిగణిస్తూ ఒక్కో దానికి రూ.111 చొప్పున ఆ మొత్తం ఇవ్వాలని సూచించారు. టికెట్‌ను చూసిన ఆ మహిళతో పాటు తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. నిబంధనల ప్రకారమే ఇచ్చినట్లు కేఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు తమతో తీసుకెళ్లే జంతువులు, పక్షులకు సగం టికెట్‌ ధర చెల్లించాలని తెలిపారు. తీసుకోని ప్రయాణికులకు వారి ప్రయాణ టికెట్‌ ధరలో పది శాతం జరిమానా విధిస్తామని.. ఇవ్వని కండక్టర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవటం నిబంధనల్లోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని