ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్‌ నేడు చెబుతారు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు.

Published : 28 Mar 2024 06:15 IST

మద్యం కుంభకోణం సొమ్ములపై ఆధారాలూ కోర్టుకు అందిస్తారు
అరవింద్‌ సతీమణి సునీత సంచలన ప్రకటన

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. మద్యం కుంభకోణంలో నిజానిజాలను తన భర్త గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. ‘‘మద్యం కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు 250 సార్లకు పైగా సోదాలు జరిపింది. ఎందులోనూ వారికి ఏమీ దొరకలేదు. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28న కోర్టులో అన్ని నిజాలు వెల్లడిచేస్తానని అరవింద్‌ కేజ్రీవాల్‌ చెప్పారు. లిక్కర్‌ కుంభకోణం డబ్బు ఎక్కడుందో ఆయన న్యాయస్థానంలో చెబుతారు. అందుకు తగిన ఆధారాలు కూడా ఇస్తారు’’ అని సీఎం సతీమణి వెల్లడించారు. కేజ్రీవాల్‌ నిజమైన దేశభక్తుడు, ధైర్యం గల నేత అని తెలిపారు.‘‘నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన మధుమేహంతో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేఖ పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోంది. దిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురవుతున్నారు’’ అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా సందేశం విడుదల చేశారు. మద్యం విధానం కేసులో ఈ నెల 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కస్టడీ గడువు ముగియనున్న నేపథ్యంలో దర్యాప్తు అధికారులు ఆయనను గురువారం కోర్టులో హాజరుపరచనున్నారు.

రాజకీయంగా బలహీనపరిచేందుకే అరెస్టు

మద్యం కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్‌ దిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. ‘‘ఎన్నికల ముందు ఆప్‌ను విచ్ఛిన్నం చేసేందుకు, రాజకీయంగా బలహీనపర్చేందుకే కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. ఆయనను  తక్షణమే విడుదల చేయాలి’’ అని సీఎం తరఫు న్యాయవాది సింఘ్వి కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

మూడు వారాల సమయం కావాలి: ఈడీ

ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తూ ‘మాకు మంగళవారమే కేజ్రీవాల్‌ పిటిషన్‌ కాపీ అందింది. దాన్ని పరిశీలించి బదులిచ్చేందుకు 3 వారాల సమయం కావాలి’ అని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ..ఈడీ అరెస్టు విషయంలో జోక్యం చేసుకునేందుకు తిరస్కరిస్తూ కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇచ్చి.. స్పందించేందుకు ఏప్రిల్‌2 వరకు గడువు ఇచ్చారు. తుది విచారణను ఏప్రిల్‌ 3కు వాయిదా వేశారు.

క్షీణించిన కేజ్రీవాల్‌ ఆరోగ్యం: ఆప్‌ వర్గాలు

మధుమేహ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం ఈడీ కస్టడీలో క్షీణించినట్లు తెలుస్తోంది. కస్టడీలో ఆయనకు షుగర్‌ స్థాయిలు దారుణంగా పడిపోయాయని ఆప్‌ వర్గాలు ఆరోపించాయి.

జైలు నుంచి పాలన జరగదు: వీకే సక్సేనా

ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతారన్న ఆప్‌ నేతల ప్రకటనల నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం జైలు నుంచి నడవదు అని దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా బుధవారం అన్నారు. ఆయన టైమ్స్‌ నౌ సమ్మిట్‌లో మాట్లాడుతూ జైలు నుంచి ప్రభుత్వ పాలన జరగదని తాను దిల్లీ ప్రజలకు హామీ ఇస్తునట్లు తెలిపారు.


అమెరికా దౌత్యవేత్తకు భారత్‌ సమన్లు

కేజ్రీవాల్‌ అరెస్టుపై వాషింగ్టన్‌ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం భారత్‌ తీవ్ర నిరసన తెలిపింది. దిల్లీలోని అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు విదేశీ వ్యవహారాల శాఖ ఈ మేరకు సమన్లు జారీ చేసింది. దక్షిణ బ్లాకులోని విదేశాంగ శాఖ కార్యాలయంలో 30 నిమిషాల పాటు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. దౌత్య సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని తాము భావిస్తున్నామని భారత్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో అమెరికా మళ్లీ స్పందిస్తూ..కేజ్రీవాల్‌ కేసులో నిష్పాక్షిక, పారదర్శక, కాలావధితో కూడిన విచారణను తాము కోరుకుంటున్నామని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని