చివరి ఓటరునూ చేరుకోవాలని!

దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది.

Updated : 28 Mar 2024 05:47 IST

ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నం
కొండలు, గుట్టలు ఎక్కి.. నదుల్లో ప్రయాణించి..

దిల్లీ: దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఏ ఒక్క ఓటరునూ వదిలిపెట్టకుండా వారు ఓటేసే అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం పోలింగ్‌ సిబ్బంది అడవుల్లో ప్రయాణిస్తారు.. మంచు పర్వతాలను ఎక్కుతారు.. నదులను లైఫ్‌ జాకెట్లతో దాటుతారు.. మైళ్లకొద్దీ కొండలు, గుట్టలపై ట్రెక్కింగ్‌ చేస్తారు.. ఈవీఎంలను గుర్రాలు, ఏనుగులపై తరలిస్తారు.. అది సముద్ర మట్టానికి 15,000 అడుగులకుపైగా ఎత్తులో ఉండే ప్రపంచంలోనే అత్యంత  ఎత్తైన పోలింగ్‌ కేంద్రమైనా.. సముద్రంలోని దీవుల్లో ఓడల కంటెయినర్లలోనైనా పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది.


94 ప్రత్యేక పోలింగ్‌ బూత్‌లు

మణిపుర్‌లో ఘర్షణల కారణంగా ప్రత్యేక శిబిరాల్లో తలదాచుకుంటున్న వారి కోసం ఎన్నికల సంఘం 94 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసింది. పునరావాస శిబిరాల్లోని దాదాపు 50,000 మంది ఈ కేంద్రాల్లో ఓటు వేయనున్నారు.


హిమాచల్‌లో అత్యంత ఎత్తైన పోలింగ్‌ కేంద్రం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్‌ కేంద్రం హిమాచల్‌ ప్రదేశ్‌లోని తాషీగంగ్‌లో ఉంది. ఇది 15,256 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గ్రామంలో 52 మంది ఓటర్లున్నారు.

హిమాచల్‌ ప్రదేశ్‌లో 10,000 నుంచి 12,000 అడుగుల ఎత్తులో 65 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. 12,000 అడుగులకుపైగా ఎత్తులో 20 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.


మేఘాలయలో ఎంతో కష్టం

మేఘాలయలోని పశ్చిమ జైంతియా జిల్లాలోని కాంసింగ్‌ గ్రామానికి పోలింగ్‌ సిబ్బంది లైఫ్‌ జాకెట్లను ధరించి వెళ్తుంటారు. వారికి డైవర్లు సహకరిస్తుంటారు. ఈ గ్రామ ప్రజలు తమలపాకులను పండిస్తారు. సోలార్‌ విద్యుత్తే వారికి ఆధారం. జిల్లా కేంద్రమైన జోవాయ్‌కి 69 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి వాహనాలు వెళ్లే అవకాశం లేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే నాటు పడవలే దిక్కు. భారత్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దులో ఉన్న ఈ గ్రామానికి వెళ్లాలంటే గంటపాటు పడవలో ప్రయాణించాలి. ఇక్కడ 35 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 20 మంది పురుషులు, 15 మంది మహిళలు.


గిర్‌ అడవుల్లో..

గిర్‌ అడవుల్లోని బనెజ్‌లో ప్రత్యేక పోలింగ్‌ స్టేషన్‌ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తుంది. 2007లో ఇక్కడ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసినప్పుడు ఒకే ఒక ఓటరు ఉండేవారు. అక్కడి బనేశ్వర్‌ మహాదేవ్‌ శివాలయంలో మహంత్‌  హరిదాస్‌జీ ఉదాసీన్‌ ఒక్కరే ఉండేవారు. ఆయన ఒక్కరి కోసం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేసేవారు. 10 మంది పోలింగ్‌ సిబ్బంది వెళ్లేవారు. దీనికోసం వారు అడవిలో 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేది. 2019లో హరిదాస్‌ ఉదాసీన్‌ మరణించారు.


అరుణాచల్‌లోనూ..

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని మాలోగామ్‌కు సమీపంలోని హయులియాంగ్‌లో ఒకే ఓటరు ఉంటారు. ఆమె కోసం ఎన్నికల సిబ్బంది 300 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. అందులోనూ 39 కిలోమీటర్లు కొండల్లో నడవాలి. చైనా సరిహద్దులో ఈ గ్రామం ఉంటుంది. ఇక్కడ సోకెలా తయాంగ్‌ అనే 44 ఏళ్ల ఓటరు ఒక్కరే ఉంటారు. మిగిలిన వారంతా మాలోగామ్‌లో ఓటేసేందుకు వచ్చినా ఆమె రారు. దీంతో పోలింగ్‌ సిబ్బంది ఆ గ్రామానికి వెళ్లాల్సి వస్తోంది. 


ఆఫ్రికా వలసదారుల కోసం..

తూర్పు ఆఫ్రికా నుంచి 14, 17 శతాబ్దాల్లో మన దేశానికి వలస వచ్చిన సిద్దీల వారసుల కోసం సోమనాథ్‌ జిల్లాలోని గిర్‌ అడవుల్లోని తలాలా ప్రాంతంలో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ఇక్కడ 3,500 మంది ఓటర్లున్నారు. 17వ శతాబ్దంలో సిద్దీలు మురుద్‌లోని జంజీరా ద్వీపాన్ని పాలించారు. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా, గుజరాత్‌లోని జఫ్రాబాద్‌, కఠియవాడ్‌ ప్రాంతాలు వారి ఆధీనంలో ఉండేవి. జంబూర్‌ ప్రాంతంలో సిద్దీలు అధికంగా ఉండేవారు. 2022 గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వారి కోసం ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో సిద్దీలు స్వతంత్ర అభ్యర్థిని రంగంలోకి దించారు.

  • గుజరాత్‌కు అత్యంత పొడవైన 1,600 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ ఉండే పలు దీవుల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటవుతాయి. 2022లో అలియాబెట్‌లో ఈసీ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 217 మంది ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేసింది.
  • రాజులా నియోజకవర్గంలోని సియాల్‌బెట్‌ ద్వీపంలో 5 పోలింగ్‌ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. దీంతో 4,757 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీటివల్ల వారు 15 కిలోమీటర్లు కొండలు ఎక్కి దిగి రావాల్సిన అవసరం తప్పింది.

తూర్పు తీరంలో..

తూర్పు తీరంలోని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో 9 మంది ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్‌ బూత్‌ను 2019లో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.


ఉత్తరాఖండ్‌లో..

2022లో ఉత్తరాఖండ్‌లోని ఛమోలీ జిల్లా దుమాక్‌, కాల్గోత్‌ గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను సీఈసీ రాజీవ్‌ కుమార్‌ సందర్శించారు. ఇందుకోసం ఆయన 3 రోజుల్లో 8 కిలోమీటర్ల దూరం కొండలపై ప్రయాణించాల్సి వచ్చింది. దీంతో ఆయన ఈ ప్రాంతాల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి ఇచ్చే పారితోషికాన్ని రెట్టింపు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని