ఇలా ప్రవేశం.. అలా ఆమోదం

దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు.

Updated : 28 Mar 2024 05:25 IST

 17వ లోక్‌సభలో 45 బిల్లులకు ఒకే రోజులో సమ్మతి
ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ నివేదిక వెల్లడి

దిల్లీ: దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. ఆమోదం పొందే వరకు మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇటీవల ముగిసిన 17వ లోక్‌సభలో అయిదేళ్ల కాలవ్యవధిలో మొత్తం 240 బిల్లులను ప్రవేశపెట్టగా 222 బిల్లులకు ఆమోదం లభించింది. వీటిలో 45 బిల్లులు ప్రవేశపెట్టిన రోజే సభ్యుల సమ్మతిని పొందాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌(ఏడీఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు తమ అధ్యయన నివేదికలో వెల్లడించాయి. సభలో ప్రవేశపెట్టిన రోజే ఆమోదం పొందిన వాటిల్లో...సెంట్రల్‌ జీఎస్టీ(సవరణ) బిల్లు-2023, ఎన్నికల చట్టాల(సవరణ) బిల్లు-2021 వంటి కీలకమైనవి ఉన్నాయి.

  • అయిదేళ్ల కాలంలో... ప్రతి ఎంపీ సగటున 165 ప్రశ్నలు అడిగారు. మొత్తం 273 సిటింగ్స్‌కు గాను 189 సిటింగ్‌లకు హాజరయ్యారు.
  • సభకు అత్యధిక సార్లు హాజరైన వారిగా ఛత్తీస్‌గఢ్‌ ఎంపీలు నిలిచారు. వారి సగటు హాజరీ 216. అత్యల్ప హాజరీ(127) అరుణాచల్‌ ఎంపీలదే.
  • మహారాష్ట్రకు చెందిన ఎంపీలు సగటున గరిష్ఠ స్థాయిలో 315 ప్రశ్నలు సంధిస్తే... మణిపుర్‌ ఎంపీలు కనిష్ఠంగా 25 ప్రశ్నలు మాత్రమే అడిగారు.
  • పార్టీల వారీగా చూస్తే...ఎన్సీపీ ఎంపీలు సగటున అత్యధికంగా 410 ప్రశ్నలు వేశారు. అప్నా దళ్‌ (సోనేలాల్‌) సభ్యులు అత్యల్పంగా 5 ప్రశ్నలు మాత్రమే అడిగారు.
  • తెలుగు దేశం పార్టీ సభ్యుల సగటు హాజరీ 229 కాగా ఆప్‌ ఎంపీల సగటు హాజరీ 57 మాత్రమే.
  • వ్యక్తిగతంగా అత్యధికంగా 596 ప్రశ్నలు సంధించిన భాజపా ఎంపీ సుకాంత మజుందార్‌ అగ్ర స్థానంలో నిలిచారు.
  • సభ్యులు అడిగిన ప్రశ్నల్లో...ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వ్యవసాయం, రైతుల సంక్షేమం, రైల్వేలకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని