రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే

ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 05:28 IST

 కేజ్రీవాల్‌ అరెస్టుతో ఆప్‌పై సానుభూతి
దిల్లీ మంత్రి ఆతిశీ వ్యాఖ్యలు

దిల్లీ: ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. దిల్లీ ప్రభుత్వ పాలన జైలు నుంచి సాగబోదన్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ఆతిశీ ఈ మేరకు స్పందించారు. ఏ రాజ్యాంగ నిబంధన ఆధారంగా ఆయన (లెఫ్టినెంట్‌ గవర్నర్‌) మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం మేరకు ఎవరైనా చట్టసభ సభ్యుడు దోషిగా తేలితేనే వారి సభ్యత్వం రద్దవుతుందని గుర్తు చేశారు. ఏ ఇతర అవకాశం లేనప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన విధించాలని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసిందన్నారు. ‘ఈడీ మీ చేతిలో ఉంది. వారికి ఎటువంటి ఆధారాలు అవసరం లేదు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద అరెస్టు అయ్యే నేతలు బెయిల్‌ పొందలేరు. దీనికింద అందరు విపక్ష సీఎంలు అరెస్టవుతారు. అప్పుడు వారు రాజీనామా చేయడం, ప్రభుత్వాన్ని పడగొట్టడం లేదా రాష్ట్రపతి పాలన విధించడం.. ఇదే వారి ఫార్ములా’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం ఆప్‌నకు లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆతిశీ అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి పెద్ద ఎత్తున సానుభూతి వ్యక్తం అవుతోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఆప్‌ నేత దీపక్‌ సింగ్లా ఇంట్లో బుధవారం ఈడీ సోదాలు నిర్వహించింది.

ఆప్‌ గోవా శాఖ అధ్యక్షుడికి ఈడీ సమన్లు

ఆప్‌ గోవా శాఖ అధ్యక్షుడు అమిత్‌ పాలేకర్‌తోపాటు మరికొందరు నేతలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది. దిల్లీ మద్యం విధానంలో మనీ లాండరింగ్‌ కేసులో ఈ నెల 28న గోవాలోని పంజిమ్‌లో గల తమ కార్యాలయంలో హాజరుకావాలంటూ కోరింది. 2022లో జరిగిన గోవా శాసనసభ ఎన్నికల్లో అమిత్‌ను తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆప్‌ ప్రకటించింది. ఇటీవల ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రానికి అక్రమ నగదు పంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవని, తనతో సహా తమ పార్టీ నేతలంతా ఎటువంటి దర్యాప్తునెదుర్కోవడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈడీ సమన్లు జారీ కావడం విశేషం.

దిల్లీ అసెంబ్లీలో ఆప్‌ నేతల ఆందోళన

పసుపు రంగు టీ-షర్టులు ధరించి, కేజ్రీవాల్‌ మాస్కులు పెట్టుకుని దిల్లీ మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌ సహా ఆప్‌ ఎమ్మెల్యేలంతా బుధవారం దిల్లీ అసెంబ్లీకి హాజరయ్యారు. శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కాగానే ఆప్‌ నేతలంతా వెల్‌లోకి దూసుకొచ్చారు. భాజపా నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 1 వరకూ శాసనసభ వాయిదాపడింది. అనంతరం భాజపా దిల్లీ శాఖ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ నేతృత్వంలో ఆ పార్టీ నేతలు శాసనసభ వెలుపల ఆందోళనకు దిగారు. కేజ్రీవాల్‌ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్‌ చేశారు. అలాగే కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ తన మంత్రులకు ఉత్తర్వులు పంపిన అంశంపై దర్యాప్తు చేపట్టాలంటూ భాజపా ప్రతినిధి బృందం దిల్లీ పోలీసు కమిషనర్‌ సంజయ్‌ అరోడాకు వినతి పత్రం సమర్పించింది.

ఆందోళనకు లాయర్ల పిలుపు.. దిల్లీ హైకోర్టు ఆగ్రహం

కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ కోర్టు ప్రాంగణాల్లో ఆందోళనలకు ఆప్‌ న్యాయ విభాగం పిలుపునిచ్చింది. దీనిపై దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టుల్లో నిరసనలు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. న్యాయస్థానాల కార్యకలాపాలను ఆపకూడదు. అలా ఎవరైనా చేస్తే అది ప్రమాదకర చర్యే. ఈ అంశంపై గురువారం విచారణ చేపడతాం’’ అని కోర్టు వెల్లడించింది. ఇదిలా ఉండగా కేజ్రీవాల్‌ నిర్దోషి అని తేలేవరకూ న్యాయవాదులెవరూ ఆయనకు మద్దతుగా ఎటుంటి ఆందోళనలకు దిగొద్దంటూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఓ ప్రకటనలో కోరింది.


అప్పుడు లాలూ-రబ్రీ.. ఇప్పుడు కేజ్రీవాల్‌-సునీత

దిల్లీ: మద్యం కుంభకోణంలో నిజానిజాలను తన భర్త గురువారం (మార్చి 28) కోర్టులో బయటపెట్టనున్నట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత బుధవారం చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ స్పందించారు. ‘లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కుంభకోణంలో చిక్కుకున్నప్పుడు రబ్రీ దేవీ ప్రకటనలు చేసేవారు. క్రమంగా సీఎం కుర్చీని చేజిక్కించుకున్నారు. ప్రస్తుతం అరవింద్‌ కేజ్రీవాల్‌- సునీతా కేజ్రీవాల్‌ వ్యవహారం అలానే ఉంది. కాంగ్రెస్‌ అవినీతికి వ్యతిరేకంగా కేజ్రీవాల్‌ నిరాహార దీక్షలు చేసేవారు. కానీ, ఇప్పుడు ఆయనే అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఆప్‌నకు చెందిన ఎంపీ, మంత్రులు, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ అందరూ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్న సీఎం కూడా ప్రస్తుతం అక్కడే ఉన్నారు. కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి పదవిపై ఎంత వ్యామోహం అంటే ఆయన జైల్లో ఉండి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు’ అని అనురాగ్‌ ఠాకుర్‌ అన్నారు. కేజ్రీవాల్‌ కూర్చునేచోటు నుంచే సునీత వీడియో రికార్డు చేసినట్లు కనిపించిందని.. బిహార్‌లో రబ్రీ దేవి మాదిరిగానే సునీత కూడా మారనున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని