నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద

రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్‌లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.

Updated : 29 Mar 2024 05:57 IST

ఆధ్యాత్మిక చైతన్యంలో మరువలేని సేవలు
ఆయన బోధనలు శాశ్వతం
సేవకు పరమార్థమేమిటో నాకు చెప్పారు
ప్రత్యేక వ్యాసంలో ప్రధాని మోదీ

దిల్లీ: రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్‌లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆయన బోధనలు నిరంతం ప్రేరణ శక్తిగా నిలుస్తాయని చెప్పారు. ఇటీవల కన్నుమూసిన స్వామి స్మరణానందకు నివాళులు అర్పిస్తూ మోదీ గురువారం ప్రత్యేక వ్యాసం రాశారు. ‘‘లోక్‌సభ ఎన్నికల కోలాహలం మొదలైన సమయంలో స్మామి స్మరణానంద పరమపదించారన్న వార్తతో కొంతసేపు నేను నిశ్చేష్టుడినయ్యాను. భారత ఆధ్యాత్మిక చైతన్యంలో ఆయనది కీలక భూమిక. ఆయన లేకపోవడం వ్యక్తిగతంగా నాకెంతో లోటు. కొన్నేళ్ల క్రితం స్వామి ఆత్మస్థానంద.. ఇప్పుడు స్వామి స్మరణానంద దివంగతులు కావడం విషాదకరం. ఈ నెలారంభంలో నేను కోల్‌కతా వెళ్లినప్పుడు స్వామి స్మరణానంద ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు ఆసుపత్రిని సందర్శించాను.

జీవితాలు అంకితం చేసిన మహనీయులు

2020 జనవరిలో బేలూరు మఠంలో నేను బస చేసినప్పుడు స్వామి వివేకానంద గదిలో ధ్యానం చేశాను. స్వామి ఆత్మస్థానంద గురించి చాలా సుదీర్ఘంగా స్వామి స్మరణానందతో మాట్లాడాను. రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి, స్వామి వివేకానందల బోధనల్ని విశ్వవ్యాప్తం చేయడానికి వారిద్దరూ తమ జీవితాలను అంకితం చేశారు. ఈ సందేశం రాస్తున్నప్పుడు వారిద్దరితో నాకున్న అనుబంధం- జ్ఞాపకాల పొరల్లోంచి బయటకు వస్తోంది. రామకృష్ణ మిషన్‌తో నాకున్న సన్నిహిత బంధం గురించి అందరికీ తెలుసు. ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఐదు దశాబ్దాల కాలంలో అనేక ప్రదేశాలను సందర్శించిన నేను పలువురు సాధువులను, మహాత్ములను కలిశాను. ఆధ్యాత్మికత కోసం జీవితాలు అంకితం చేసిన స్వాములు, సాధువుల గురించి రామకృష్ణమఠంలో నాకు తెలిసింది. అలాంటివారిలో స్వామి ఆత్మస్థానంద, స్వామి స్మరణానందలు ప్రముఖులు. వారి పవిత్ర బోధనలు, వారు అందించిన విజ్ఞానం నాకు మానసిక ఆనందాన్ని ఇచ్చాయి. ఆధునిక విద్య, నిపుణత, మహిళా సాధికారతలకు వారెంతగానో తపించారు.


భిన్న సంస్కృతులను ప్రేమించారు

విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో రామకృష్ణ మిషన్‌ చేసిన కృషితో మనమంతా స్ఫూర్తి పొందాం. భారత ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి, విద్యారంగంలో సాధికారతకు, మానవతా సేవలకు ఈ మిషన్‌ పాటుపడుతోంది. గుజరాత్‌లోని కచ్‌ను 2001లో భూకంపం కుదిపేసింది. అప్పుడు మొట్టమొదట నాకు ఫోన్‌ చేసి, సాయం అందిస్తామని చెప్పినవారిలో స్వామి ఆత్మస్థానంద ఒకరు. ఎంతోమందిని వారు ఆదుకున్నారు. అన్ని సంస్కృతులు, సంప్రదాయాలను స్వామి ఆత్మస్థానంద ప్రేమించి, గౌరవించిన విధానం నన్నెంతో ఆకట్టుకుంది. గుజరాత్‌లో ఉన్నప్పుడు ఆయన గుజరాతీ భాష నేర్చుకున్నారు. ఆయన గుజరాతీలో మాట్లాడుతుంటే వినడం నాకెంతో ఇష్టం. ఇలాంటి సాధుసంతులు సామాజిక మార్పులకు పాటుపడిన తీరు మన మాతృభూమికి గర్వకారణం. ఐకమత్య స్ఫూర్తితో పనిచేస్తూ, సమాజంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వారు మనకు చూపించారు. అమృతకాలంలో వికసిత భారత్‌ను సాధించడంలో అవి మనకు బలాన్నిస్తాయి’’ అని మోదీ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని