4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ని అణచివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Updated : 29 Mar 2024 05:55 IST

ఆప్‌ అణచివేతకు ఈడీ యత్నం
మాది అవినీతి పార్టీగా చూపాలనుకుంటున్నారు
కోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)ని అణచివేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. తమది అవినీతి పార్టీ అన్న తప్పుడు ముసుగును దేశం ముందు ఆ దర్యాప్తు సంస్థ సృష్టిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం విధానానికి సంబంధించిన కేసులో తన అరెస్టును తప్పుబట్టారు. ఒక సిట్టింగ్‌ సీఎంను అరెస్టు చేసేందుకు నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా అని ప్రశ్నించారు. ఈడీ దర్యాప్తును తానేమీ వ్యతిరేకించడం లేదని, కావాల్సినన్నాళ్లూ ఆ సంస్థ తనను కస్టడీలో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక రౌజ్‌ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఎదుట గురువారం స్వయంగా వాదనలు వినిపించారు. అనంతరం- కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని మరో నాలుగు రోజులపాటు కోర్టు పొడిగించింది. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు తిరిగి ఆయన్ను తమ ముందు హాజరుపరచాలని అధికారులను ఆదేశించింది.

ఇంకా ప్రశ్నించాల్సి ఉందన్న ఈడీ

మద్యం విధానానికి సంబంధించిన కేసులో కేజ్రీవాల్‌ ఈ నెల 21న అరెస్టయ్యారు. ఆరు రోజుల కస్టడీ గడువు ముగియనుండటంతో తిరిగి గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కొత్త రిమాండ్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. గత అయిదు రోజుల్లో కేజ్రీవాల్‌ వాంగ్మూలాలను నమోదు చేశామని, కానీ ఆయన డొంకతిరుగుడు సమాధానాలు చెబుతున్నారని అందులో పేర్కొన్నారు. ఈ కేసులో మరింత లోతుగా, మరికొందరితో కలిపి ప్రశ్నించేందుకు కేజ్రీవాల్‌ను మరో ఏడు రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. అనంతరం- ఏప్రిల్‌ 1 వరకు ఆయనకు ఈడీ కస్టడీ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు వెలువరించింది. కేసులోని ఓ సాక్షి భాజపాకు భారీగా సొమ్మును విరాళం రూపంలో అందించినట్లు కేజ్రీవాల్‌ ఆరోపించారని ఉత్తర్వుల్లో ప్రస్తావించింది.

కేజ్రీవాల్‌ ఏం వాదించారంటే..

కిక్కిరిసిన కోర్టు గదిలో జడ్జి అనుమతితో కేజ్రీవాల్‌ హిందీలో దాదాపు 10 నిమిషాలపాటు వాదనలు వినిపించారు. ‘‘మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఇప్పటిదాకా సీబీఐ 31 వేల పేజీలను కోర్టుకు సమర్పించింది. 294 మంది సాక్షులను విచారించింది. ఈడీ 162 మందిని ప్రశ్నించింది. 25 వేల పేజీల నివేదిక సమర్పించింది. ఈ పత్రాలు, నివేదికలన్నింటినీ కలిపి పరిశీలిస్తే.. అసలు నన్నెందుకు అరెస్టు చేశారు? నా పేరు కేవలం నాలుగు వాంగ్మూలాల్లోనే ఉంది. ఒక సిట్టింగ్‌ సీఎంను అరెస్టు చేసేందుకు నాలుగు స్టేట్‌మెంట్లు సరిపోతాయా?’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు. తన పేరు ప్రస్తావన ఉన్న నాలుగు వాంగ్మూలాల గురించి వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

1. సి.అరవింద్‌ వాంగ్మూలం

దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియా వ్యక్తిగత కార్యదర్శి సి.అరవింద్‌ ఒక వాంగ్మూలం ఇచ్చారు. నా(కేజ్రీవాల్‌) అధికారిక నివాసంలో నా సమక్షంలో తనకు సిసోదియా కొన్ని పత్రాలు ఇచ్చారని ఆయన చెప్పారు. నా ఇంటికి చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉన్నతాధికారులు తమ కార్యదర్శులతో కలిసి వస్తుంటారు. ఎవరు ఎవరికి ఏమిస్తున్నారో నాకెలా తెలుస్తుంది?

2. మాగుంట శ్రీనివాసులరెడ్డి వాంగ్మూలం

రెండో వాంగ్మూలం.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డికి చెందిన వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇచ్చింది. ఆయన ఒకరోజు నా కార్యాలయానికి వచ్చి, దిల్లీలో చారిటబుల్‌ ట్రస్ట్‌ తెరవాలనుకుంటున్నట్లు చెప్పారు. భూముల అంశం మా పరిధిలోకి రాదన్నాను. 2023 ఫిబ్రవరిలో ఆయన కుమారుణ్ని ఈడీ అరెస్టు చేసింది. నాకు వ్యతిరేకంగా వాంగ్మూలమిచ్చేలా ఒత్తిడి చేసింది. ఈడీకి మాగుంట ఇచ్చిన మూడు వాంగ్మూలాల్లో ఒక్కదాన్నే పరిగణనలోకి తీసుకున్నారు.

3. మాగుంట రాఘవ వాంగ్మూలం

మరో వాంగ్మూలం మాగుంట రాఘవది. ఆయన మొత్తం ఏడు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. అందులో ఆరు నాకు వ్యతిరేకంగా లేవు. కానీ నాకు వ్యతిరేకంగా ఏడో వాంగ్మూలం ఇచ్చిన వెంటనే రాఘవ జైలు నుంచి విడుదలయ్యారు.

4. శరత్‌చంద్రారెడ్డి వాంగ్మూలం

నాలుగో వాంగ్మూలం శరత్‌చంద్రారెడ్డిది. తన అరెస్టుకు ముందు రెండు వాంగ్మూలాల్లోగానీ, అరెస్టయ్యాక ఇచ్చిన 9 వాంగ్మూలాల్లోగానీ ఆయన నాకు వ్యతిరేకంగా ఏమీ చెప్పలేదు. ఆరు నెలలపాటు జైల్లో మగ్గాక.. 2023 ఏప్రిల్‌ 25న మరో వాంగ్మూలం ఇచ్చారు. నాకు వ్యతిరేకంగా చెప్పిన ఒకేఒక్క విషయం ఏంటంటే.. ‘విజయ్‌ నాయర్‌తో కలిసి దిల్లీ సీఎంను కలిసేందుకు వెళ్లా’ అని.

ఈడీ ప్రధాన ఉద్దేశాలు ఆ రెండే..

ఒక సిట్టింగ్‌ సీఎంను అరెస్టు చేసేందుకు ఈ నాలుగు వాంగ్మూలాలు సరిపోతాయా? ఆప్‌ రూ.100 కోట్ల ముడుపులు తీసుకుందంటూ ఈడీ చేస్తున్న ఆరోపణలకు ఆధారాల్లేవు. ఈడీ దర్యాప్తు మొదలయ్యాకే.. మద్యం విధానానికి సంబంధించిన అసలు కుంభకోణం ప్రారంభమైంది.

‘అదంతా కేజ్రీవాల్‌ ఊహ’

కేజ్రీవాల్‌ వాదనలను అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) ఎస్‌.వి.రాజు తోసిపుచ్చారు. దిల్లీ సీఎం పేరును తమ వాంగ్మూలాల్లో తర్వాత ప్రస్తావించినవారంతా అందుకు కారణాలను వెల్లడించారని చెప్పారు. తనకు వ్యతిరేకంగా ఉన్న పత్రాలనే కోర్టులో ప్రవేశపెడుతున్నారన్నది కేజ్రీవాల్‌ ఊహేనన్నారు.


నా భర్తను వేధిస్తున్నారు..
కేజ్రీవాల్‌ సతీమణి సునీత ఆరోపణ

దిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై ఆయన సతీమణి సునీత ఆందోళన వ్యక్తంచేశారు. ఆయనను అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపించారు. గురువారం కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఈడీ అధికారులు తీసుకురాగా అక్కడికి వచ్చిన సునీత విలేకర్లతో మాట్లాడారు. తన భర్త ఆరోగ్యం బాగోలేదని, చక్కెరస్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈడీ అధికారులు తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ దౌర్జన్యం ఎంతోకాలం సాగదని, ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. పాత ఆరోపణలనే ఆప్‌ పదేపదే చెబుతూ న్యాయవ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని భాజపా అధికార ప్రతినిధి షెహ్‌జాద్‌ పూనావాలా ఆరోపించారు.

కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలో మద్యం సీసాతో వచ్చిన రాఘవ్‌కుమార్‌ తివారీ అనే వ్యక్తిని దిల్లీ పోలీసులు కోర్టు వెలుపల అడ్డుకున్నారు. న్యాయవాది తరహా దుస్తుల్లో వచ్చిన ఆ వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు తరలించి ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని