సంక్షిప్త వార్తలు (10)

మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు 1996 నాటి డ్రగ్స్‌ కేసులో గురువారం గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

Updated : 29 Mar 2024 05:53 IST

మాజీ ఐపీఎస్‌ సంజీవ్‌ భట్‌కు 20 ఏళ్ల జైలు

పాలన్‌పుర్‌: మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌కు 1996 నాటి డ్రగ్స్‌ కేసులో గురువారం గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. డ్రగ్స్‌ కేసులో తప్పుడు సాక్ష్యాలు సృష్టించి రాజస్థాన్‌కు చెందిన ఓ న్యాయవాదిని ఇరికించారని భట్‌పై అభియోగం. ఆ సమయంలో ఆయన బానస్‌కాంటా ఎస్పీగా ఉన్నారు. 1990లో జరిగిన జామ్‌నగర్‌ కస్టోడియల్‌ మృతి కేసులో ప్రస్తుతం సంజీవ్‌ యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్ష పూర్తయిన వెంటనే ప్రస్తుత శిక్ష ప్రారంభమవుతుందని న్యాయస్థానం తెలిపింది.


దీదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత ఘోష్‌పై కేసు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కుటుంబ నేపథ్యాన్ని కించపరిచేలా భాజపా నేత దిలీప్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలపై గురువారం కేసు నమోదైంది. దుర్గాపుర్‌ కోర్టులో ఓ న్యాయవాది, మరో వ్యక్తి చేసిన ఫిర్యాదుల మేరకు దిలీప్‌ ఘోష్‌పై సెక్షన్‌ 504, 509 కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి, అవమానకరమైనవి అంటూ ఘోష్‌కు ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు జారీ చేసిన మరుసటిరోజే కేసు నమోదు కావడం గమనార్హం.


కంగనాపై సుప్రియా శ్రీనేత్‌ వ్యాఖ్యలు.. నివేదిక ఇవ్వాలని పోలీస్‌ కమిషనర్‌కుదిల్లీ ఎల్జీ ఆదేశం

దిల్లీ: బాలీవుడ్‌ నటి, భాజపా లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌ సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంపై దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) వి.కె.సక్సేనా దృష్టిసారించారు. ఈ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ ఆరోరాను ఆదేశించారు. ఈ మేరకు రాజ్‌ నివాస్‌ అధికారులు గురువారం వెల్లడించారు. భాజపా నాయకురాలు బాంసురీ స్వరాజ్‌ చేసిన ఫిర్యాదు మేరకు ఎల్జీ ఈ ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు.


మద్యం కుంభకోణం కేసులో గోవా ఆప్‌ నేతల విచారణ

పణజీ: మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఆప్‌ గోవా యూనిట్‌ అధ్యక్షుడు అమిత్‌ పాలేకర్‌తోపాటు మరో ముగ్గురు గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పై ఉన్న కేసుకు సంబంధించి పాలేకర్‌, రామ్‌రావ్‌ వాగ్‌, దత్త ప్రసాద్‌ నాయక్‌, అశోక్‌ నాయక్‌లను ఈడీ విచారణకు పిలిచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.


ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దును నాడు వి.కె.సింగ్‌ అడ్డుకున్నారు: ఒమర్‌

సోపోర్‌: యూపీఏ-2 హయాంలో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) రద్దు కాకుండా నాడు సైన్యాధ్యక్షుడిగా ఉన్న ప్రస్తుత భాజపా నేత జనరల్‌ వి.కె.సింగ్‌ అడ్డుకున్నారని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.‘‘హోం మంత్రి అమిత్‌ షాకు ఇప్పుడు ఏఎఫ్‌ఎస్‌పీఏ గుర్తుకొచ్చింది. దాని రద్దు కోసం నేను సీఎంగా ఉన్న 2011 నుంచి పోరాడుతున్నా. నాడు వ్యతిరేకత జనరల్‌ వి.కె.సింగ్‌ నుంచే వచ్చింది. ఆయన అప్పుడు సైన్యాధిపతి. ఇప్పుడు మీ మంత్రివర్గ సహచరుడు. ఎందుకు అప్పుడు అడ్డుకున్నారో ఆయన్ని అడగండి. ఇప్పుడు మీరు ఏఎఫ్‌ఎస్‌పీఏ రద్దు చేస్తామని ప్రజలను మోసం చేస్తున్నారు’’ అని ఒమర్‌ పేర్కొన్నారు.


భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునఃప్రారంభించం: పాక్‌

ఇస్లామాబాద్‌: భారత్‌తో వాణిజ్య సంబంధాలు పునఃప్రారంభించే ఆలోచన తమ దేశానికి లేదని పాకిస్థాన్‌ విదేశీ వ్యవహారాల కార్యాలయ అధికారి ముంతాజ్‌ జహ్రా బలోచ్‌ స్పష్టం చేశారు. ఇటీవల పాక్‌ విదేశాంగ మంత్రి ఇషాక్‌ ధార్‌ భారత్‌తో పాకిస్థాన్‌ వాణిజ్యాన్ని పునరుద్ధరించే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని లండన్‌ పర్యటనలో భాగంగా పేర్కొన్నారు. పొరుగు దేశాల పట్ల తమ వైఖరిలో మార్పు ఉంటుందని, తమ దేశ వ్యాపారవేత్తలు భారత్‌తో వ్యాపారాన్ని మళ్లీ కొనసాగించాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే పాక్‌ విదేశీ వ్యవహారాల కార్యాలయం ఈ విధంగా స్పందించడం గమనార్హం. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను పాక్‌ రద్దు చేసిన విషయం తెలిసిందే.


అమెరికా వైఖరి అవాంఛితం

దిల్లీ: ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారంలో అమెరికా చేసిన వ్యాఖ్యలు అవాంఛితమని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. స్వతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థలు మన దేశానికి గర్వకారణమని, విదేశీ శక్తుల ప్రభావం నుంచి వాటిని రక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గురువారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ‘దేశ ఎన్నికల, చట్టపరమైన ప్రక్రియల్లో బాహ్యశక్తుల ప్రమేయం ఆమోదయోగ్యం కాదు. ఈ వ్యవహారంపై ఇప్పటికే తీవ్ర నిరసన తెలియజేశాం’ అని వెల్లడించారు. దేశంలో చట్ట ప్రకారమే న్యాయప్రక్రియ నడుస్తుందన్నారు.


అరుణాచల్‌పై అమెరికా వ్యాఖ్యలకు చైనా అభ్యంతరం

బీజింగ్‌: అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమేనంటూ ఇటీవల అమెరికా స్పష్టం చేయడాన్ని చైనా సైన్యం గురువారం తప్పుబట్టింది. తమ రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యను పరిష్కరించుకోవడానికి పరిపక్వత కలిగిన యంత్రాంగం, సమాచార సాధనాలు, చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే సామర్థ్యం ఉన్నాయని స్పష్టం చేసింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ చైనాలో అంతర్భాగమేనని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి కర్నల్‌ వూ కియాన్‌ మరోసారి పేర్కొన్నారు.


ఆర్థిక సంస్కరణలు కాంగ్రెస్‌ ఘనత కాదు

రచయిత గురుచరణ్‌ దాస్‌

దిల్లీ: మూడు దశాబ్దాల కిందట (1991లో) అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్‌ దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చారని.. కాంగ్రెస్‌ పార్టీకి వాటితో సంబంధం లేదని ప్రముఖ రచయిత, వ్యాఖ్యాత గురుచరణ్‌ దాస్‌ తెలిపారు. తన పుస్తకం ‘‘ది డైలమా ఆఫ్‌ యాన్‌ ఇండియన్‌ లిబరల్‌’’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనం ఉత్తినే సంస్కరణలు చేసుకొంటూపోయాం. పీవీ, మన్మోహన్‌ ప్రభృతులు ఈ విషయంలో సొంత పార్టీని (కాంగ్రెస్‌) కూడా ఒప్పించలేకపోయారు. కాబట్టి, కాంగ్రెస్‌కు సంస్కరణలతో సంబంధం లేదు. వాస్తవానికి పీవీతో ఆ పార్టీకి పొసగలేదు’’ అన్నారు.


గృహనిర్బంధంలో మీర్వాయిజ్‌!

శ్రీనగర్‌: హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ మీర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ను గృహ నిర్బంధంలో ఉంచినట్లు అంజుమన్‌ అకౌఫ్‌ జామియా మసీదు తెలిపింది. గురువారం ఆయన అలీ మసీదులో ప్రసంగం చేయాల్సి ఉందని, కానీ ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధంలో ఉంచారని ఒక ప్రకటనలో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని