ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్‌ ప్రారంభించిన భారత్‌

ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్‌ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ గురువారం తెలిపారు.

Published : 29 Mar 2024 04:43 IST

ఐరాస: ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్‌ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ గురువారం తెలిపారు. భారత్‌ నేతృత్వంలోని ‘గ్రూప్‌ ఆఫ్‌ ఫ్రెండ్స్‌’(జీవోఎఫ్‌) ఉన్నతస్థాయి సమావేశం మంగళవారం జరిగిందని, ఆ సందర్భంగా ఈ డేటాబేస్‌ ప్రారంభాన్ని ప్రకటించినట్లు వెల్లడించారు. ‘జవాబుదారీతనం కోసం వాదించడంలో భారత్‌ ముందంజలో ఉంది. ఈ కారణానికి అంకితమైన జీవోఎఫ్‌ బృందానికి నాయకత్వం వహిస్తుంది’ అని కాంబోజ్‌ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘ఈ డేటాబేస్‌ ఆన్‌లైన్‌ కోశాగారంగా పని చేయడానికి రూపొందింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై నమోదైన కేసులను పర్యవేక్షించడానికి, పరిష్కరించడానికి సభ్యదేశాలకు అధికారం కల్పిస్తుంది. ఈ డేటాబేస్‌, యునైట్‌ అవేర్‌ ప్లాట్‌ఫామ్‌లో రూపొందింది. సమగ్ర విశ్లేషణను సులభతరం చేయడానికి, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి సమర్థమైన వ్యూహాలను నడపడానికి సిద్ధంగా ఉంది’ అని ఐరాస భారత శాశ్వత మిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2022లో ఐరాస భద్రతా మండలికి భారత్‌ అధ్యక్షత వహిస్తున్న సమయంలో శాంతి పరిరక్షకులకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి ఈ జీవోఎఫ్‌ను ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని