మేం జోక్యం చేసుకోలేం

మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది.

Updated : 29 Mar 2024 05:48 IST

కేజ్రీవాల్‌ను పదవి నుంచి తప్పించాలన్న పిల్‌ను కొట్టివేసిన దిల్లీ హైకోర్టు
రాజ్యాంగ వైఫల్యం తలెత్తితే రాష్ట్రపతి లేదా ఎల్జీ చూసుకుంటారని వ్యాఖ్య

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఆ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాజ్యాంగ వైఫల్యం వంటి పరిస్థితి ఏమైనా తలెత్తితే.. కార్యనిర్వాహక వర్గాలు చూసుకుంటాయని పేర్కొంది. దేశ రాజధానిలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలినట్లు తాము ప్రకటించలేమని స్పష్టీకరించింది. సుర్జీత్‌సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఈ పిల్‌ను దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కేజ్రీవాల్‌ అరెస్టుతో సాధారణ ప్రజల దృష్టికోణంలో దిల్లీ సర్కారు సమగ్రతపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగితే రాజధానిలో రాజ్యాంగ యంత్రాంగం కుప్పకూలుతుందని పేర్కొన్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మన్మోహన్‌, జస్టిస్‌ మన్మీత్‌ పి.ఎస్‌.అరోడాల ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘సీఎం అరెస్టు వల్ల పరిపాలనలో చాలా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. దాన్ని మేం అంగీకరిస్తాం. అయితే ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకునేందుకు అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కేజ్రీవాల్‌ సీఎంగా కొనసాగకుండా నిలువరించే నిబంధనలు చట్టాల్లో ఏమున్నాయి?’’ అని  ప్రశ్నించింది. ‘‘ఈ అంశంలో కోర్టుల జోక్యానికి అవకాశం లేదని మేం భావిస్తున్నాం. ప్రభుత్వంలోని ఇతర విభాగాలే చట్టప్రకారం ఈ వ్యవహారాన్ని పరిశీలించాలి’’ అని వ్యాఖ్యానించింది. రాష్ట్రపతి/గవర్నర్‌ పాలనను హైకోర్టు విధించదని పేర్కొంది. ‘‘రాజ్యాంగపరమైన వైఫల్యం ఏమైనా తలెత్తితే రాష్ట్రపతి చూసుకుంటారు. లేదా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ చర్యలకు ఉపక్రమిస్తారు. అవసరమైతే మంత్రిమండలి ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. అంతేగానీ మేం జోక్యం చేసుకోలేం’’ అని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితి వస్తుందని కార్యనిర్వాహక శాఖ బహుశా ఊహించి ఉండకపోవచ్చునని, అందుకే ఈ వ్యవహారంలో అది ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టొచ్చని వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని