కేజ్రీవాల్‌ పాస్‌వర్డులు చెప్పలేదు

మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 4 డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డులను చెప్పలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది.

Updated : 29 Mar 2024 05:43 IST

ఆస్తుల వివరాలూ సమర్పించాల్సి ఉంది
రిమాండ్‌ పిటిషన్‌లో ఈడీ వెల్లడి

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ 4 డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డులను చెప్పలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తెలిపింది. ఆస్తుల వివరాలనూ ఆయన ఇంకా సమర్పించలేదని వెల్లడించింది. తొలుత విధించిన కస్టడీ గడువు ముగియడంతో కేజ్రీవాల్‌ను ఈడీ గురువారం తిరిగి స్థానిక రౌజ్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. ఆయన్ను మరో ఏడు రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కొత్త రిమాండ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దిల్లీ సీఎం తమ కస్టడీలో ఉండగా జరిగిన దర్యాప్తు వివరాలను అందులో పొందుపరిచింది.

కేజ్రీవాల్‌ భార్య మొబైల్‌ ఫోన్‌ నుంచి డేటా వెలికితీశామని, ప్రస్తుతం దాన్ని విశ్లేషిస్తున్నామని రిమాండ్‌ పిటిషన్‌లో ఈడీ తెలియజేసింది. అయితే కేజ్రీవాల్‌కు సంబంధించిన ప్రాంగణాల్లో ఈ నెల 21న జరిపిన సోదాల్లో జప్తు చేసిన 4 డిజిటల్‌ పరికరాల నుంచి ఇంకా డేటా బయటకు తీయలేదని పేర్కొంది. వాటి పాస్‌వర్డులు, లాగిన్‌ వివరాలు తెలిపేందుకు.. తన న్యాయవాదులతో సంప్రదించిన అనంతరం ఆయన సమయం కోరారని తెలిపింది. స్థిర-చరాస్తులు, ఆదాయపు పన్ను రిటర్నులకు (ఐటీఆర్‌) సంబంధించి తాము అడిగిన డేటా, ఇతర ఆర్థిక వివరాలను కేజ్రీవాల్‌, ఆయన కుటుంబసభ్యులు ఇంకా సమర్పించలేదని వెల్లడించింది. దిల్లీ సీఎం తన కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఇచ్చిన అపాయింట్‌మెంట్ల వివరాలనూ కోరినట్లు తెలిపింది.

మరో ముగ్గురి వాంగ్మూలాలూ..

మద్యం విధానం కేసుకు సంబంధించిన మరో ముగ్గురి వాంగ్మూలాలనూ నమోదు చేశామని కోర్టుకు ఈడీ నివేదించింది. మనీశ్‌ సిసోదియా దిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన సి.అరవింద్‌ను కేజ్రీవాల్‌తో కలిపి విచారించామని పేర్కొంది. 2021-22 మద్యం విదానానికి సంబంధించి మంత్రుల బృందం ముసాయిదా నివేదికను దిల్లీ సీఎం నివాసంలో సి.అరవింద్‌కే అందజేశారని గుర్తుచేసింది.

2022 నాటి గోవా ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తరఫున పోటీ చేసిన ఓ అభ్యర్థి వాంగ్మూలాన్ని కూడా తాము నమోదు చేశామని ఈడీ తెలిపింది. ఆయన దగ్గర డబ్బు లేకున్నా.. ఎన్నికల ఖర్చు బాధ్యతనంతా దిల్లీలోని ఆప్‌ కార్యాలయం తమవారి ద్వారా చూసుకుందని పేర్కొంది. దిల్లీలో మద్యం హోల్‌సేల్‌ విక్రేతలపై పంజాబ్‌కు చెందిన కొందరు సీనియర్‌ ఎక్సైజ్‌ అధికారులు ఒత్తిడి తీసుకొచ్చారని ఈడీ వెల్లడించింది. ముడుపుల డిమాండ్‌ నెరవేరనప్పుడు వారు హోల్‌సేల్‌ విక్రేతల ఫ్యాక్టరీలను మూసివేయడం, పంజాబ్‌కు సరకు రాకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించింది. కేజ్రీవాల్‌ కస్టడీ సమయంలో తాము ఆ అధికారులకూ సమన్లు జారీ చేశామని తెలిపింది. అయితే సంగ్రూర్‌లో కల్తీ మద్యం విషాదం నేపథ్యంలో వారు కొంత సమయం కోరారని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని