‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ

సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన 58 ఏళ్ల దేవ్‌కీనందన్‌ శర్మ.

Published : 29 Mar 2024 05:33 IST

విద్యుదాఘాతంతో చేతులు కోల్పోయిన దేవ్‌కీనందన్‌ శర్మ
సంకల్పబలంతో మేనేజర్‌గా ఎదిగిన వైనం

కోటా: సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్‌కు చెందిన 58 ఏళ్ల దేవ్‌కీనందన్‌ శర్మ. రెండు చేతులూ కోల్పోయినా కుంగిపోకుండా మొక్కవోని దీక్షతో కాలి వేళ్లతో రాయడం నేర్చుకొని నేడు ఆఫీస్‌ మేనేజర్‌ హోదాలో సమర్థంగా విధులు నిర్వర్తిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. నైనీతాల్‌ జిల్లాలోని శిలాలేఖ్‌ గ్రామంలో జన్మించిన శర్మ చదువుకుంటూనే ఒప్పంద కార్మికుడిగా పనిచేసేవారు. 1981లో ఆయనకు విద్యుదాఘాతం కారణంగా రెండు చేతులనూ తొలగించారు. దీంతో తల్లిదండ్రులు చదువు మాన్పించి అడవిలో పశువులను మేపుకొని రావడానికి పంపేవారు. అక్కడ ఆయన కాలి వేళ్ల మధ్య చెట్టు కొమ్మను పట్టుకొని నేలపై అక్షరాలు రాయడం సాధన చేశారు. అలా ఆరు నెలలు కష్టపడి కాలివేళ్లతో అక్షరాలు రాయడం నేర్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ చదువును కొనసాగించి 1986లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేశారు. రాజస్థాన్‌లోని కోటాలో భగవాన్‌ మహావీర్‌ వికలాంగ్‌ సహాయత సమితి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులకు శర్మ ప్రతిభ, సామర్థ్యాల గురించి తెలిసింది. వారు తమ సంస్థలో 2001లో స్టోర్‌ కీపర్‌గా ఉద్యోగమిచ్చారు. అక్కడ అంచెలంచెలుగా ఎదిగి ఆఫీస్‌ మేనేజర్‌ స్థాయికి చేరుకున్నారు. ఆయన కుమారుడు ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని