కేజ్రీవాల్‌ ఫోన్‌లోని ఎన్నికల వ్యూహాల కోసం ఈడీ యత్నాలు

భాజపా రాజకీయ ఆయుధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వ్యవహరిస్తోందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు.

Published : 30 Mar 2024 06:05 IST

భాజపా రాజకీయ ఆయుధంగా వ్యవహరిస్తున్న దర్యాప్తుసంస్థ
దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపణ

దిల్లీ: భాజపా రాజకీయ ఆయుధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వ్యవహరిస్తోందని దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ మొబైల్‌ ఫోన్‌ను పరిశీలించి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) లోక్‌సభ ఎన్నికల వ్యూహాలను తెలుసుకోవాలని ప్రయత్నిస్తోందన్నారు. ఆతిశీ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ కస్టడీ పొడిగించాలని కోరుతూ ఈడీ గురువారం కోర్టులో వినిపించిన వాదనల గురించి ప్రస్తావించారు.కేసు దర్యాప్తు కోసం ఈడీ పాస్‌వర్డ్‌లు అడగటం లేదని, కేజ్రీవాల్‌ ఫోన్‌లో ఏముందో తెలుసుకునేందుకు ఇది భాజపా చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. ‘‘ఆప్‌ లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, ప్రచార ప్రణాళికలు, విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలతో జరిపిన చర్చలు, మీడియా-సోషల్‌ మీడియా ప్రచారానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నారు’’ అని ఆతిశీ ఆరోపించారు.

కేజ్రీవాల్‌ కోసం సందేశాలు పంపండి: సునీత

దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాడుతున్నారని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి సునీత అన్నారు. ఆయనకు అండగా ఉండేందుకు ప్రజలందరి ఆశీర్వాదం కావాలని కోరారు. ఈ మేరకు మరో వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. వాట్సప్‌ ప్రచారాన్ని ప్రారంభించారు. ‘‘నా భర్త నిజమైన దేశభక్తుడు. ఈ రోజు నుంచి మేం ప్రత్యేక ఆందోళన కార్యక్రమం (డ్రైవ్‌) మొదలుపెడుతున్నాం. కేజ్రీవాల్‌ కోసం 8297 3246 24 వాట్సప్‌ నంబరుకు మీ సందేశాలు పంపండి. అవన్నీ నేను ఆయనకు చేరవేస్తాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారు’’ అని సునీత తన సందేశంలో వెల్లడించారు.

సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు పచ్చజెండా

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ  నేత, మంత్రి సత్యేందర్‌ జైన్‌పై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోంశాఖ అనుమతిచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ దర్యాప్తు కోరుతూ దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఈ ఏడాది ఫిబ్రవరిలో చేసిన సిఫార్సులకు అనుగుణంగా దర్యాప్తునకు అనుమతిచ్చింది. జైల్లో తనకు రక్షణ కల్పిస్తానంటూ మంత్రి సత్యేందర్‌ జైన్‌ తన నుంచి బలవంతంగా రూ.10 కోట్లు వసూలు చేశారన్న ఆర్థిక నేరగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపణలపై ఈ దర్యాప్తు జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని