లోక్‌సభ సభ్యుల్లో 225 మందిపై క్రిమినల్‌ కేసులు

లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్లను పరిశీలించగా, వారిలో 225 మంది(44 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది.

Published : 30 Mar 2024 03:57 IST

నివేదికలో వెల్లడించిన ఏడీఆర్‌

దిల్లీ: లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్‌ ఎంపీల అఫిడవిట్లను పరిశీలించగా, వారిలో 225 మంది(44 శాతం) తమపై క్రిమినల్‌ కేసులు నమోదయినట్లు పేర్కొన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రీఫార్మ్స్‌(ఏడీఆర్‌) వెల్లడించింది. ఎంపీల్లో 5 శాతం మంది వద్ద రూ.వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తెలిపింది. ఏడీఆర్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. క్రిమినల్‌ కేసులు నమోదైన ఎంపీల్లో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, అపహరణ, మహిళలపై నేరాలకు పాల్పడటం వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నాయి. హత్య కేసులు నమోదైన 9 మంది ఎంపీల్లో అయిదుగురు, హత్యాయత్నం కేసుల్లో నిందితులైన 28 మంది ఎంపీల్లో 21మంది భాజపాకు చెందినవారున్నారు.  ముగ్గురిపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని ఎంపీల్లో సగం మందికి పైగా క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారు. అత్యంత ధనిక ఎంపీల్లో కాంగ్రెస్‌కు చెందిన నకుల్‌నాథ్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో డీకే సురేశ్‌ (కాంగ్రెస్‌), కనుమూరి రఘురామ కృష్ణరాజు (ఇటీవల వైకాపాకి రాజీనామా చేశారు) ఉన్నారు. 73 శాతం మంది ఎంపీలు గాడ్యుయేషన్‌ పూర్తి చేశారని, మొత్తం ఎంపీల్లో 15 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నట్లు ఏడీఆర్‌ నివేదికలో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని