బధిరులు, అంధులు కూడా సినిమాలను ఆస్వాదించే ఏర్పాట్లు ఉండాలి

సినిమాలను ఆస్వాదించే సౌలభ్యం బధిరులు, అంధులకు కూడా అందుబాటులో ఉండాలని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

Published : 30 Mar 2024 05:15 IST

ఆ దిశగా జులై 15లోపు మార్గదర్శకాలను నోటిఫై చేయండి
కేంద్రానికి దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: సినిమాలను ఆస్వాదించే సౌలభ్యం బధిరులు, అంధులకు కూడా అందుబాటులో ఉండాలని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఏ సౌకర్యం అయినా వారికి అందుబాటులో ఉండటం చట్టపరమైన హక్కు అని, దాన్ని ఉల్లంఘిస్తే వికలాంగుల హక్కుల చట్టం కింద నేరంగా పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. థియేటర్లు, ఓటీటీ మాధ్యమాల్లో ప్రదర్శించే సినిమాలను సాధారణ ప్రేక్షకుల్లాగే బధిరులు, అంధులు కూడా ఆస్వాదించేలా అవసరమైన ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖను ఆదేశించింది. ఇందుకు సంబంధించి కేంద్రం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసి, జులై 15లోపు నోటిఫై చేయాలని స్పష్టం చేసింది. వాటిని అమలు చేసేందుకు సినిమా థియేటర్లు, సినీ నిర్మాతలు, ఓటీటీ మాధ్యమాలు సహా ప్రదర్శన వ్యవస్థలోని అన్ని విభాగాలకూ తగిన సమయాన్ని నిర్దేశించాలని పేర్కొంది. బాలీవుడ్‌ కథానాయకుడు షారుక్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ చిత్రాన్ని తాము ఆస్వాదించేలా తగిన ఏర్పాట్లు చేసే దిశగా కేంద్రాన్ని ఆదేశించాలని ముగ్గురు అంధులు, ఓ బధిరుడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్‌ ప్రతిభ ఎం.సింగ్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రదర్శన రంగంలోని ప్రతినిధుల నుంచి వచ్చే సూచనలు, సలహాలను పరిశీలించి స్పందించడానికి ఒక అండర్‌ సెక్రటరీని నామినేట్‌ చేయాలని కేంద్రానికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని