యూపీలో భద్రత కట్టుదిట్టం

గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (63) మృతితో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు.

Updated : 30 Mar 2024 05:49 IST

ముఖ్తార్‌ అన్సారీ పోస్టుమార్టం పూర్తి
గాజీపుర్‌కు మృతదేహం తరలింపు

లఖ్‌నవూ, బాందా: గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (63) మృతితో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో శుక్రవారం భద్రతా చర్యలను అధికారులు కట్టుదిట్టం చేశారు. బాందా, మవూ, గాజీపుర్‌, వారణాసి జిల్లాల్లో స్థానిక పోలీసులతోపాటు పారా మిలటరీ, సీఆర్పీఎఫ్‌ను మోహరించారు. రాష్ట్రమంతటా 144 సెక్షను కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్లు డీజీపీ ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. గతంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తార్‌ తనపై ఉన్న 60కు పైగా కేసుల కారణంగా బాందా జైలులో ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా గురువారం రాత్రి ఆయనను ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.  ముఖ్తార్‌ మృతిపై త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో మెజిస్టీరియల్‌ విచారణకు బాందా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బాందా వైద్య కళాశాల ఆసుపత్రిలో డాక్టర్ల బృందం నిర్వహించిన శవపరీక్షను ఆద్యంతం వీడియో తీసినట్లు ప్రిన్సిపల్‌ సునీల్‌ కౌశల్‌ తెలిపారు. అంతర్భాగాలు (విసరా) భద్రపరుస్తామని చెప్పారు. శవపరీక్ష అనంతరం ముఖ్తార్‌ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం 24 పోలీసు వాహనాల ఎస్కార్టుతో గాజీపుర్‌కు తరలించారు. కుమారుడు ఉమర్‌ అన్సారీ, ఇతర కుటుంబసభ్యులు వెంట ఉన్నారు. పటిష్ఠమైన బందోబస్తు నడుమ ఉన్న గాజీపుర్‌లోని ముఖ్తార్‌ ఇంటి వద్దకు పెద్దసంఖ్యలో అభిమానులు చేరుకొంటున్నారు.

న్యాయ విచారణకు అఖిలేశ్‌, మాయావతి డిమాండ్‌

మాజీ శాసనసభ్యుడైన ముఖ్తార్‌ అన్సారీ మృతిపై సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో న్యాయ విచారణ జరగాలని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి సైతం ఈ ఉదంతంపై ఉన్నతస్థాయి విచారణ జరగాలని ‘ఎక్స్‌’ ద్వారా కోరారు. 


ఈ రోజు మాకు హోలీ పండగ 

ముఖ్తార్‌ అన్సారీ మరణంపై భాజపా దివంగత ఎమ్మెల్యే కృష్ణానంద్‌ రాయ్‌ భార్య అల్కారాయ్‌ స్పందించారు. ‘‘ఇది భగవంతుడి ఆశీర్వాదం. ఈరోజు మా కుటుంబానికి హోలీ పండగ’’ అన్నారు. ముఖ్తార్‌ చేతిలో తన భర్త హత్యకు గురయ్యాక ఇప్పటిదాకా తాము హోలీ జరుపుకోలేదన్నారు.

 దివంగత ఎమ్మెల్యే కృష్ణానంద్‌ భార్య


నాన్నకు జైలులో విషమిచ్చారు: ఉమర్‌ అన్సారీ

ముఖ్తార్‌ అన్సారీ కుమారుడైన ఉమర్‌ అన్సారీ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘‘నాన్నకు జైలులో స్లో పాయిజన్‌ ఇచ్చారు. ఆయన మరణవార్త మాకు మీడియా ద్వారానే తెలిసింది. దీనిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలి. న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం’’ అన్నారు. ముఖ్తార్‌ సోదరుడైన గాజీపుర్‌ మాజీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీ సైతం ఇదేవిధమైన ఆరోపణలు చేశారు. అధికారులు వాటిని ఖండించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని