దిల్లీ మద్యం కేసులో మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ను ప్రశ్నించిన ఈడీ

దేశ రాజధాని దిల్లీలో రద్దైన మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ (49)ను ఈడీ అధికారులు శనివారం ప్రశ్నించారు.

Published : 31 Mar 2024 05:17 IST

5 గంటల పాటు కొనసాగిన విచారణ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో రద్దైన మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్‌ కేసులో మంత్రి కైలాస్‌ గహ్లోత్‌ (49)ను ఈడీ అధికారులు శనివారం ప్రశ్నించారు. సెంట్రల్‌ దిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటల సమయంలో వచ్చిన కైలాస్‌ సాయంత్రం 4.30 గంటలకు తిరిగి వెళ్లారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, దర్యాప్తునకు సహకరిస్తానని తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. నజఫ్‌గఢ్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కైలాస్‌ గహ్లోత్‌...సీఎం కేజ్రీవాల్‌ మంత్రివర్గంలో రవాణా, హోం, న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. దిల్లీ మద్యం విధానం 2021-22 రూపొందించిన మంత్రుల బృందంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా, పట్టణాభివృద్ధి శాఖ మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌తో పాటు కైలాస్‌ గహ్లోత్‌ కూడా సభ్యుడు. మద్యం విధానాన్ని బీఆర్‌ఎస్‌ నేత కె.కవితతో పాటు సౌత్‌గ్రూప్‌నకు లీక్‌చేసి ప్రతిగా ఆప్‌, ఆ పార్టీ నేతలు రూ.100 కోట్ల ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి గహ్లోత్‌ను దర్యాప్తు అధికారులు పలు ప్రశ్నలు అడిగారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తదితర కార్యక్రమాల గురించి తనకు తెలియదని, ఎన్నడూ భాగస్వామిని కాలేదని గహ్లోత్‌ చెప్పారు. ఈడీ విచారణ గురించి విలేకరులు మరికొన్ని ప్రశ్నలు అడగగా....రహస్య విచారణ ప్రక్రియ సమాచారం వెల్లడించలేనన్నారు. మద్యం విధాన రూపకల్పనలో కుంభకోణమేమీ లేదని, కాలక్రమంలో ఈ కేసు తేలిపోతుందని మంత్రి పేర్కొన్నారు.  దిల్లీ మద్యం కేసు అభియోగ పత్రంలో ఈడీ అధికారులు... కైలాస్‌ గహ్లోత్‌ పేరుతో పాటు ఇప్పటికే అరెస్టయిన ఆప్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జి విజయ్‌ నాయర్‌ పేరునూ ప్రస్తావించారు. గహ్లోత్‌ ఒకే నంబరు ఉన్న సిమ్‌ను మూడు సార్లు మార్చారని ఈడీ ఆరోపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని