హిమాచల్‌, కశ్మీర్‌లో హిమపాతం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, లాహౌల్‌, స్పితి, కల్ప, కుకుంసేరితోపాటు జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌, పహల్గామ్‌ తదితర ఎతైన ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి హిమపాతం సంభవించింది.

Published : 31 Mar 2024 04:33 IST

లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు
భారీ సంఖ్యలో రహదారుల మూసివేత

శ్రీనగర్‌, శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మనాలి, లాహౌల్‌, స్పితి, కల్ప, కుకుంసేరితోపాటు జమ్మూకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌, పహల్గామ్‌ తదితర ఎతైన ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి హిమపాతం సంభవించింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. మనాలి సమీపంలోని రోహ్‌తంగ్‌లో అటల్‌ సొరంగం వద్ద భారీ మంచు కారణంగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. లాహౌల్‌, స్పితిలోని గోండ్లలో 24 గంటల వ్యవధిలో 15 సెం.మీ., కల్పలో 10 సెం.మీ., కోథి, కుకుంసేరిల్లో 5 సెం.మీ., కీలాంగ్‌లో 3 సెం.మీ. మేర మంచు కురిసింది. శుక్రవారం రాత్రి రాష్ట్రంలోని నాలుగు జాతీయ రహదారులు సహా మొత్తం 172 రోడ్లను మూసివేశారు. 662 విద్యుత్తు నియంత్రికలు దెబ్బతిన్నాయి. శనివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కార్యాలయం ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. మరోవైపు కశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లా పహల్గామ్‌ రిసార్టులో 3 అంగుళాల మేర మంచు కురిసింది. బాందీపొరా జిల్లాలోని గురెజ్‌, లద్దాఖ్‌లోని శ్రీనగర్‌-లేహ్‌ జాతీయ రహదారి సమీపంలోని ద్రాస్‌ పట్టణంలోనూ మంచు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీనగర్‌ సహా పలు చోట్ల రాత్రంతా వర్షం కురిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని