గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అంత్యక్రియలు పూర్తి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో మరణించిన గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (63) అంత్యక్రియలు శనివారం గాజీపుర్‌లో పూర్తయ్యాయి.

Published : 31 Mar 2024 04:35 IST

వేలాదిగా తరలివచ్చిన జనం

గాజీపుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాందా జైలులో శిక్ష అనుభవిస్తూ అనారోగ్యంతో మరణించిన గ్యాంగ్‌స్టర్‌, రాజకీయవేత్త ముఖ్తార్‌ అన్సారీ (63) అంత్యక్రియలు శనివారం గాజీపుర్‌లో పూర్తయ్యాయి. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య కాలీబాగ్‌ శ్మశానవాటికలో ఈ కార్యక్రమాన్ని  నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన జనం లోనికి వెళ్లేందుకు శ్మశానం వద్ద ఏర్పాటుచేసిన బారికేడ్లను కూల్చివేయడంతో గందరగోళం నెలకొంది. జనం నినాదాలు చేస్తూ సమాధిపై మట్టి సమర్పించేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా గాజీపుర్‌ జిల్లా మేజిస్ట్రేటు (డీఎం) ఆర్యకా అఖౌరీకి, ముఖ్తార్‌ సోదరుడైన మాజీ ఎంపీ అఫ్జల్‌ అన్సారీకి మధ్య వాగ్వాదం జరిగింది. ‘‘కుటుంబసభ్యులు చాలు కదా’’ అని అధికారి చెప్పగా, ‘‘అందరినీ అనుమతించాల్సిందే’’ అంటూ అఫ్జల్‌ వాదించారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అంత్యక్రియలను వీడియో తీస్తున్నామని, ఆ తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని డీఎం అన్నారు. ముఖ్తార్‌ అన్సారీ పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే అయిన అబ్బాస్‌ అన్సారీ క్రిమినల్‌ కేసుల కారణంగా కాస్‌గంజ్‌ జైలులో ఉన్నందున అంత్యక్రియలకు హాజరుకాలేదు. కాగా, ముఖ్తార్‌ మృతికి గుండెపోటే కారణమని శవపరీక్ష నివేదికలో వెల్లడైనట్లు బాందా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. జైలులో ‘స్లో పాయిజన్‌’ ఇచ్చిన కారణంగా ఆయన మృతిచెందినట్లు కుటుంబసభ్యులు ఆరోపించడంతోపాటు ప్రతిపక్షాలు సైతం పలు సందేహాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మవూ సదర్‌ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముఖ్తార్‌ అన్సారీకి గాజీపుర్‌, వారణాసి జిల్లాల్లో గట్టి పట్టుంది.

‘ఆలస్యమైనా.. న్యాయమే జరిగింది’

‘‘ఇది ఎప్పుడో జరగాల్సింది. దేవుడు ఆలస్యం చేశాడు. అయినా మంచే చేశాడు. ఈరోజు మాకు న్యాయం జరిగింది’’ అని గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ మృతిపై అనితా ఉపాధ్యాయ్‌ అనే మహిళ స్పందించారు. ముఖ్తార్‌ బృందం చేతిలో హతమైన పోలీస్‌ కానిస్టేబులు నిర్భయ్‌ ఉపాధ్యాయ్‌ భార్య ఈమె.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు