‘ప్రజాదరణ’లో విభిన్నం మోదీ

ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ విభిన్నమైన వ్యక్తని అంతర్జాతీయ పత్రిక ‘ఎకనామిస్ట్‌’ అభిప్రాయపడింది.

Published : 31 Mar 2024 06:05 IST

సామాన్యులతోపాటు ఉన్నత స్థాయి వర్గాల్లోనూ సానుకూలత
గట్టిగా నిలిచే నేతని వారి భావన
ఎకనామిస్ట్‌ పత్రికలో కథనం

దిల్లీ: ప్రజాదరణలో ప్రపంచ దేశాల నేతలందరిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ విభిన్నమైన వ్యక్తని అంతర్జాతీయ పత్రిక ‘ఎకనామిస్ట్‌’ అభిప్రాయపడింది. సాధారణంగా సామాన్య జనబాహుళ్యంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ఏ నేతకైనా ఆ దేశంలోని విద్యా, సంపద పరంగా ఉన్నత స్థాయిలో ఉండే వర్గాల్లో వ్యతిరేకత ఉంటుందని, కానీ మోదీకి వారిలోనూ బహుళ ప్రజామోదం లభిస్తోందని పేర్కొంది. ‘వై ఇండియాస్‌ ఎలైట్స్‌ బ్యాక్‌ మోదీ’ అనే పేరుతో ఎకనామిస్ట్‌ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

‘హుందాతనంతో కూడిన రాజకీయాలు (క్లాస్‌ పొలిటిక్స్‌), ఆర్థికం (ఎకనామిక్స్‌), ఉన్నత వర్గాల మెప్పు పొందడం (ఎలైట్‌ అడ్మిరేషన్‌) వంటి 3 అంశాలు మోదీకి ఈ వర్గాల్లో ఆదరణ కలిగి ఉండటానికి సహకరిస్తున్నాయి. ఒక రకంగా దీనిని మోదీ విభిన్న శైలిగా పిలవొచ్చు. డొనాల్డ్‌ ట్రంప్‌లాంటి మాస్‌ నేతల గాటన కట్టినా మూడోసారి విజయం సాధిస్తారని భావిస్తున్న మోదీ అసాధారణ బలవంతుడు. ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజాదరణ కలిగిన (మాస్‌ అప్పీల్‌) ఇలాంటి నేతలను ఉన్నతస్థాయి వర్గం వ్యతిరేకిస్తుంటుంది. అమెరికాలో ట్రంప్‌నకు, బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ సమయంలో అక్కడి నేతలకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ భారత్‌లో ఆ పరిస్థితి లేదు’ అని ఆ పత్రిక అభిప్రాయపడింది.

అన్ని వర్గాల్లోనూ ఒకే ఆదరణ

‘అమెరికాలో యూనివర్సిటీ విద్య పూర్తి చేసుకున్న వారిలో 26శాతం మందే ట్రంప్‌నకు మద్దతు పలుకుతున్నారని గ్యాలప్‌ సర్వేలో వెల్లడైంది. అదే సామాన్య జనంలో ఆయనకు 50శాతం మద్దతు లభించింది. కానీ మోదీకి అన్ని వర్గాల్లోనూ ఒకే స్థాయిలో ఆదరణ ఉంది. 2017లో ప్రాథమిక పాఠశాల దాటని వారిలో 66 శాతం మంది మద్దతు మోదీకి లభించింది. అదే సమయంలో ఎంతో కొంత ఉన్నత విద్యను అభ్యసించిన వారిలో 80శాతం మంది మద్దతు ఆయనకు లభించింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌నీతి జరిపిన సర్వేలో.. డిగ్రీ చదివిన వారిలో 42 శాతం మంది మోదీకి మద్దతుగా నిలిచారు. అదే ప్రాథమిక స్థాయి విద్యను అభ్యసించిన వారిలో మద్దతు 35శాతంగా ఉంది. ఉన్నత స్థాయి వర్గాల మద్దతు పొందే క్రమంలో ఆయనేమీ సామాన్యుల మద్దతును కోల్పోలేదు’ అని ఎకనామిస్ట్‌ వివరించింది.

ఆర్థికమే ప్రధాన కారణం

‘ఆర్థిక వ్యవస్థే మోదీకి ఉన్నత వర్గాల్లో ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం. సమాజంలో పంపిణీ విషయంలో అసమానతలున్నప్పటికీ భారత్‌ ఘనమైన జీడీపీ వృద్ధి రేటు సాధించడం, భారత్‌లోని ఎగువ మధ్య తరగతి వారి సంఖ్య, ఆదాయాలు పెరగడమూ మోదీపై ఆదరణకు కారణాలే. 2000 సంవత్సరం సమయంలో ఎగువ మధ్య తరగతిలో కాంగ్రెస్‌కు ఎక్కువగా ఆదరణ ఉండేది. ఆ తరువాత చోటుచేసుకున్న కుంభకోణాలతో 2010 వచ్చే సరికి కాంగ్రెస్‌కు వారి నుంచి మద్దతు కరవైంది. మోదీ హయాంలో భారత్‌ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతోపాటు అంతర్జాతీయంగా రాజనీతి ప్రదర్శించడంలో ఫలితాలు కనిపించాయి. దీంతోపాటు ఆసియాలో టైగర్లుగా పరిగణిస్తున్న చైనా, తూర్పు దేశాలకు గట్టిగా ఎదురు నిలిచి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే మోదీ లాంటి నేత కావాలని చాలా మంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం మోదీ రూపంలో అటువంటి గట్టి నేత వచ్చారని వారంతా భావిస్తున్నారు’ అని పేర్కొంది.

కేజ్రీవాల్‌ వ్యవహారంతో ఇబ్బందే

‘ఉన్నత స్థాయి వర్గాల్లో మోదీకున్న ఆదరణను తగ్గించేదేమైనా ఉందా అంటే నిరంతరాయంగా రాష్ట్రాలపట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరేనని చెప్పవచ్చు. కేజ్రీవాల్‌ అరెస్టు వ్యవహారం ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు. చాలా మంది ఉన్నత స్థాయి వర్గాల వారు ఇప్పటికీ తాము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్నామని అంటున్నారు. మోదీకి ప్రత్యామ్నాయ నేత వచ్చే వరకూ ఉన్నత వర్గాల్లో ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీ పట్ల వారికి పెద్దగా ఆశల్లేవు. గట్టి ప్రతిపక్షం వచ్చే వరకూ మోదీకి ఇబ్బంది లేనట్లే’ అని ఎకనామిస్ట్‌ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని