కాంగ్రెస్‌కు మరో ఐటీ తాఖీదు

లోక్‌సభ ఎన్నికల ముందు ఐటీ కష్టాలు కాంగ్రెస్‌ పార్టీని ఊపిరి తీసుకోనివ్వడం లేదు.

Updated : 01 Apr 2024 05:33 IST

2 నోటీసుల మొత్తం పన్ను డిమాండ్‌ రూ.3,567 కోట్లు
నేడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ విచారణకు అవకాశం!

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల ముందు ఐటీ కష్టాలు కాంగ్రెస్‌ పార్టీని ఊపిరి తీసుకోనివ్వడం లేదు. 2017-18 నుంచి 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వడ్డీలతో కలిపి రూ.1,823 కోట్లు చెల్లించాలని శుక్రవారం నోటీసు పంపిన ఆదాయపుపన్ను శాఖ.. తాజాగా మరో రూ.1,744 కోట్లు కట్టాలని ఇంకో తాఖీదు పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2014-15 నుంచి 2016-17 మదింపు సంవత్సరాలకు సంబంధించిన మొత్తంగా దీన్ని తాజా నోటీసులో పేర్కొన్నారు. 2014-15 సంవత్సరానికి రూ.663 కోట్లు, 2015-16కు రూ.664 కోట్లు, 2016-17కు రూ.417 కోట్ల పన్ను బకాయిలు ఉన్నట్లుగా అందులో వివరించారు. ఆదాయపుపన్ను శాఖ జారీచేసిన రెండు నోటీసుల ప్రకారం కాంగ్రెస్‌ పార్టీ మొత్తం రూ.3,567 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలకు ఇచ్చే పన్ను మినహాయింపు ముగిసినందున కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మొత్తం ఆదాయంపై పన్ను విధించినట్లు నోటీసులో అధికారవర్గాలు తెలిపాయి. పార్టీకి చెందిన కొందరు నేతల నుంచి విచారణ సంస్థల  దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకొన్న డైరీల్లో ఉన్న థర్డ్‌ పార్టీ ఎంట్రీలపై కూడా పన్ను వేసినట్లు వెల్లడించాయి.
- ఆదాయపుపన్ను బకాయిలు చూపించి కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాల నుంచి ఐటీ అధికారులు రూ.135 కోట్లను ఇప్పటికే రికవరీ చేశారు. దీనిపై హైకోర్టును ఆశ్రయించి ఉపశమనం లభించని కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ముందు ఈ కేసు విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇతర డైరీల్లో భాజపా నేతల పేర్లతో ఉన్న థర్డ్‌ పార్టీ ఎంట్రీలపై మాత్రం ఎలాంటి పన్ను విధించలేదని, కేంద్ర సర్కారు లోక్‌సభ ఎన్నికల వేళ ‘‘పన్ను ఉగ్రవాదం’’తో ప్రధాన ప్రతిపక్షాన్ని ఆర్థికంగా కుంగదీయాలని చూస్తోందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ విషయమై ఈసీకి సైతం ఫిర్యాదు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని