గోవా ఎన్నికల్లో ఖర్చుచేసిన ముడుపుల్ని ఐటీ, సీబీఐ కూడా గుర్తించాయి

మద్యం విధానంలో కుంభకోణం ద్వారా ముడుపుల రూపంలో పొందిన రూ.45 కోట్లను 2022లో గోవాలో ఎన్నికల ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) వాడినట్లు వచ్చిన ఆరోపణల్ని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ, సీబీఐ విచారణలూ తగినరీతిలో సమర్థిస్తున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది.

Updated : 01 Apr 2024 05:35 IST

ఎక్సైజ్‌ కుంభకోణంలో ఆప్‌ పాత్రపై ఈడీ వెల్లడి

దిల్లీ: మద్యం విధానంలో కుంభకోణం ద్వారా ముడుపుల రూపంలో పొందిన రూ.45 కోట్లను 2022లో గోవాలో ఎన్నికల ప్రచారానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) వాడినట్లు వచ్చిన ఆరోపణల్ని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ, సీబీఐ విచారణలూ తగినరీతిలో సమర్థిస్తున్నాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. ఈ మేరకు న్యాయస్థానానికి సమర్పించిన పత్రాల్లో ప్రస్తావించింది. హవాలా ఆపరేటర్ల వ్యవస్థ ఈ కేసులో పోషించిన పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. నగదు అక్రమ చలామణిపై దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను, ఆయన పార్టీ నేతల్ని విచారించాల్సి ఉందంది. లంచాల రూపంలో పొందిన డబ్బును ఎలా ఖర్చు చేసిందీ తెలుసుకునేందుకు ఐదుగురు అంగడియా ఆపరేటర్ల వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పన్నులు, సుంకాలను ఎగవేసి హవాలా మార్గంలో డబ్బు చేరవేయడానికి వజ్రాలు, ఆభరణాల వ్యాపారులు ఏర్పాటు చేసుకున్న కొరియర్‌ వ్యవస్థనే అంగడియాలు అంటారు. మద్యం విధానంలో మొత్తం రూ.100 కోట్ల లంచాలు చేతులు మారాయని ఈడీ అభియోగం. దీనిలో రూ.45 కోట్లను గోవాలో ప్రచారం నిమిత్తం ఖర్చు చేసేందుకు ఒక కంపెనీని ఆప్‌ రంగంలోకి దింపిందని ప్రత్యేక న్యాయస్థానంలో ఈడీ తెలిపింది. ఆప్‌ ఒక రాజకీయ పార్టీ అయినా దానిని పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌ 70 కింద కంపెనీగా వర్గీకరించవచ్చని పేర్కొంది. ఈ ‘కంపెనీ’కి బాధ్యుడిగా కేజ్రీవాల్‌ను చూపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాగుంట రాఘవ్‌ ద్వారా రూ.25 కోట్లను హవాలా మార్గంలో భారాస ఎమ్మెల్సీ కవితకు, ఆమె అనుచరులకు ఎలా బదలాయించిందీ గుర్తించినట్లు ఈడీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని