ఆడ్వాణీకి భారతరత్న

భాజపా అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె.ఆడ్వాణీకి భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు.

Updated : 01 Apr 2024 05:32 IST

ఇంటికి వెళ్లి అందజేసిన రాష్ట్రపతి ముర్ము

దిల్లీ: భాజపా అగ్రనేత, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌.కె.ఆడ్వాణీకి భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు- రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లారు. పురస్కారాన్ని రాష్ట్రపతి అందజేస్తున్నప్పుడు ఆడ్వాణీ చెంతనే మోదీ కూర్చొన్నారు. దేశ పురోగతికి ఆడ్వాణీ అవిరళ కృషి చేశారని, అలాంటి వ్యక్తికి అత్యున్నత పౌర పురస్కారం అందజేయడాన్ని స్వయంగా వీక్షించడం తనకెంతో ప్రత్యేకమని ప్రధాని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘ప్రజాసేవకు ఆడ్వాణీ అంకితమయ్యారు. ఆధునిక భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. గత కొన్ని దశాబ్దాలుగా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం నాకెంతో గర్వకారణం’ అని చెప్పారు.

ప్రధాని నిలబడకపోవడం రాష్ట్రపతికి అగౌరవం: కాంగ్రెస్‌

ఆడ్వాణీకి భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి  ప్రదానం చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ కనీసం లేచి నిలబడకపోవడం ఆమెను తీవ్రంగా అగౌరవపరచడమేనని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. నిల్చొని ఉన్న రాష్ట్రపతి నుంచి ఈ పురస్కారాన్ని ఆడ్వాణీ స్వీకరిస్తున్నప్పుడు ప్రధాని కూర్చొని ఉన్న ఫొటోను ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ వ్యాఖ్య చేశారు. ఆ సమయంలో మోదీ కచ్చితంగా లేచి నిల్చొని ఉండాల్సిందని అన్నారు. దిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన విపక్ష కూటమి సభలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఈ అంశంపై మాట్లాడుతూ- రాష్ట్రపతికి గౌరవ సూచకంగా ప్రధాని నిలబడకపోవడాన్ని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని