సంక్షిప్త వార్తలు (5)

అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించిన హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోమవారం వెెనక్కి తీసుకున్నారు.

Updated : 02 Apr 2024 05:45 IST

సుప్రీంకోర్టులో సోరెన్‌ పిటిషన్‌ ఉపసంహరణ

దిల్లీ: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించిన హైకోర్టు ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేసిన పిటిషన్‌ను ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సోమవారం వెెనక్కి తీసుకున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమైన బడ్జెట్‌ సమావేశాలు మార్చి 2న ముగిశాయి. హైకోర్టు ఆయన అభ్యర్థనను ఫిబ్రవరి 28న నిరాకరించింది. బడ్జెట్‌ సమావేశాలు ఇప్పటికే ముగిసిపోయినందున పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని హేమంత్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ సభ్యులుగా ఉన్న ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అందుకు ధర్మాసనం సమ్మతించింది. మనీలాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ ప్రస్తుతం జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు.


23 శునక జాతుల నిషేధంపైకేంద్రానికి దిల్లీ హైకోర్టు తాఖీదు

దిల్లీ: మనుషులపై దాడిని సాకుగా చూపుతూ 23 రకాల జాతుల శునకాలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎలాంటి అధ్యయనం నిర్వహించకుండానే నిషేధించాలన్న నిర్ణయానికి రావడం పెంపుడు శునకాల వ్యాపారం చేస్తున్న, సంబంధిత వృత్తిలో నిమగ్నమైన వారి హక్కులను హరించడమేనని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్‌ ఆరోపించారు. ఈ కేసుపై సోమవారం విచారణ చేపట్టిన జస్టిస్‌ సుబ్రమణియం ప్రసాద్‌ కేంద్రానికి నోటీసు జారీ చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ వైఖరేమిటో తెలపాలని ఆదేశించారు. 23 రకాల శునక జాతుల పెంపకం, విక్రయాలను నిషేధించాలంటూ మార్చి 12న రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.


రూ.21 వేల కోట్లు దాటిన రక్షణ ఎగుమతులు

దిల్లీ: భారత్‌ నుంచి రక్షణ రంగ ఎగుమతులు జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.21,083 కోట్ల మేర రక్షణ ఉత్పత్తులు, సాంకేతికతలను విదేశాలకు సరఫరా చేసినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో ఈ రంగంలో రూ.21 వేల కోట్ల మార్కును అధిగమించడం ఇదే తొలిసారని ‘ఎక్స్‌’ వేదికగా ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 32.5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు.


రైళ్లలో రాయితీల్లేక వృద్ధులపై నాలుగేళ్లలో రూ.5,875 కోట్ల భారం

 స.హ.చట్ట దరఖాస్తుతో వెల్లడి

దిల్లీ: రైళ్లలో ప్రయాణించే వయోవృద్ధులకు ఇచ్చే రాయితీలను ఎత్తివేయడంతో నాలుగేళ్లలో వారు రూ.5,875 కోట్ల అదనపు భారం మోయాల్సి వచ్చింది. ఆ మేరకు రైల్వేకు ఆదాయం పెరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన స.హ.చట్ట ఉద్యమకారుడు చంద్రశేఖర్‌ గౌర్‌ చేసిన దరఖాస్తులకు సమాధానంగా రైల్వేశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత 2020 మార్చి 20 నుంచి వయోవృద్ధుల రాయితీలను రైల్వే ఎత్తివేసింది. అంతకుముందు స్త్రీలకు 50%, పురుషులకు 40% తగ్గింపు లభించేది. 20.3.2020 నుంచి 31.1.2024 మధ్య 13 కోట్ల మంది వృద్ధులు, 9 కోట్ల మంది వృద్ధురాళ్లు, 33,700 మంది ట్రాన్స్‌జెండర్‌ వృద్ధులు రైళ్లలో ప్రయాణించి రూ.13,287 కోట్ల ఆదాయాన్ని సమకూర్చారు.


ఈసీ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలను దుర్వినియోగం చేయకుండా అడ్డుకట్ట వేయడానికి మిగిలి ఉన్న ఏకైక ఆశాకిరణం ఎన్నికల సంఘం(ఈసీ). సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఈసీ తన రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తిస్తూ ప్రజాస్యామ్య విలువలను కాపాడే రక్షణ కవచంలా నిలవాలి. ప్రజాస్వామ్యం మనుగడలో ఉంటేనే ఈసీ గౌరవం, ప్రతిష్ఠ చెక్కుచెదరకుండా ఉంటాయి.

అఖిలేశ్‌ యాదవ్‌


జీవితం సంఘర్షణలమయం

జీవితం సంఘర్షణలతో నిండి ఉంటుంది. మనుషులకు సాటివారితోనే కాక ప్రకృతి, సమాజం, మతం, సాంకేతికతతోనూ సంఘర్షించే వాతావరణం ఏర్పడుతుంటుంది. అంతేకాదు.. తమతో తమకే సంఘర్షణ ఎదురవుతుంటుంది. ఈ పోరాటాలకు దూరంగా ఉండటంలో కాదు, వాటికి స్పందించే తీరు, వాటిని అధిగమించి ముందుకు వెళ్లే విధానంలోనే జీవిత పరమార్థం దాగి ఉంది.

హర్ష్‌ గోయెంకా


తప్పుడు సమాచారాన్ని అడ్డుకోండి

విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్లోనూ త్వరగా వ్యాప్తి చెందుతాయి. వాటిని అడ్డుకొనే బాధ్యత మనందరిపైనా ఉంది. వాస్తవాలను విస్తృతంగా ప్రచారం చేయండి. అసత్యాలను, తప్పుడు సమాచారాన్ని గుర్తిస్తే ఇతరులను అప్రమత్తం చేయండి. వాటి ప్రభావాలపై మీ స్నేహితులకు, సన్నిహితులకు అవగాహన కల్పించండి.

ఐక్యరాజ్య సమితి


అది బలహీనతకు నిదర్శనం

రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీలు అమేఠీ, రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలి. అక్కడి నుంచి పోటీ చేయకపోవడం బలహీనతకు నిదర్శనం. వారు అక్కడి నుంచి గెలుస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రశాంత్‌ భూషణ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని