రాజ్యాంగ ధర్మాసనం ముందుకు రాష్ట్రాల రుణపరిమితి అంశం

రాష్ట్రాల రుణ సేకరణ పరిమితికి సంబంధించి కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది.

Published : 02 Apr 2024 04:58 IST

 కేరళ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు చర్య

దిల్లీ: రాష్ట్రాల రుణ సేకరణ పరిమితికి సంబంధించి కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించింది. రుణ సేకరణపై పరిమితి విధించడం ద్వారా రాష్ట్రాలను ఆర్థికంగా అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం శిక్షాత్మక, ప్రత్యేక అధికారాలను ప్రయోగిస్తోందని కేరళ తన పిటిషన్‌లో ఆరోపించింది. రాష్ట్రాల రుణ సేకరణ 293వ రాజ్యాంగ అధికరణ పరిధిలోకి వస్తుందని, దానిపై సుప్రీంకోర్టు ఇంతవరకు సాధికార భాష్యమేదీ ఇవ్వలేదని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. కేంద్రం నుంచి కానీ, మరే ఇతర సంస్థల నుంచి కానీ నిర్దేశిత పరిమితికి మించి రుణాలు తీసుకునే హక్కు ఉందా? అన్నది తేల్చే బాధ్యతను అయిదుగురు సభ్యుల ధర్మాసనానికి అప్పగించాలని తీర్మానించింది. రుణ సేకరణకు సంబంధించి కేరళ ప్రభుత్వానికి ఇప్పటికే గణనీయంగా తాత్కాలిక సహాయాన్ని అనుమతించామని తెలిపిన సుప్రీంకోర్టు ఆర్థిక విధానంలో న్యాయవ్యవస్థ ఎంతవరకు జోక్యం చేసుకోవచ్చో పరిశీలించాల్సి ఉందని పేర్కొంది. ఈ అంశాన్ని సమీక్షించడానికి విస్తృత ధర్మాసనాన్ని ఏర్పరచే విషయమై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవాలని ద్విసభ్య ధర్మాసనం కోరింది. రాజ్యాంగం రాష్ట్రాలకు ఆర్థిక స్వయంనిర్ణయాధికారాన్ని ఇచ్చిందని, ఎంతవరకు రుణాలు తీసుకోవచ్చో నిర్ణయించే అధికారం రాష్ట్రాల శాసనసభలకు ఉందని 131వ రాజ్యాంగ అధికరణ కింద దాఖలు చేసిన పిటిషన్‌లో కేరళ ప్రభుత్వం వాదించింది. కేరళ రూ. 5,000 కోట్ల రుణాలు తీసుకోవడానికి ఇప్పటికే కొన్ని షరతులతో అంగీకరించామని మార్చి 13న కేంద్రం సుప్రీంకు తెలిపింది. తమకు కనీసం రూ. 10,000 కోట్లు కావాలని కేరళ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని