పాదాలను తాకలేదని విద్యార్థిని చావబాదిన టీచర్‌

పాదాలను తాకలేదన్న కోపంతో ఆరో తరగతి విద్యార్థిని చావబాదిన ఉపాధ్యాయుడు, అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషించాడు.

Published : 02 Apr 2024 04:59 IST

అనంతరం కులం పేరుతో దూషణ

గోరఖ్‌పుర్‌: పాదాలను తాకలేదన్న కోపంతో ఆరో తరగతి విద్యార్థిని చావబాదిన ఉపాధ్యాయుడు, అంతటితో ఆగకుండా కులం పేరుతో దూషించాడు. గత నెల 27న చోటుచేసుకున్న ఈ ఘటన బాధిత విద్యార్థి తండ్రి అకల్‌జీత్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఉపాధ్యాయుడు కొట్టడంతో తన కుమారుడు మనీశ్‌కు కంటి భాగంలో తీవ్రమైన గాయమైందని, వీపు భాగంలో దెబ్బలు తగిలాయని అకల్‌జీత్‌లో ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఉర్వా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మురార్‌పుర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు రవిశంకర్‌ పాండేపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. గత నెల 27 పాఠశాలలో తన పాదాలను తాకాల్సిందిగా మనీశ్‌ను పాండే కోరాడని, అందుకు మనీశ్‌ నిరాకరించాడని ఫిర్యాదును ఉటంకిస్తూ పోలీసులు తెలిపారు. దీంతో ఉపాధ్యాయుడు విద్యార్థిని కొట్టడంతోపాటు కులం పేరుతో దూషించాడని వివరించారు. గాయాలతో విలవిల్లాడుతూ మనీశ్‌ ఏడుస్తుండగా.. పాఠశాల నుంచి బహిష్కరిస్తానని కూడా ఉపాధ్యాయుడు బెదిరించినట్లు వెల్లడించారు. అకల్‌జీత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారని ఎస్పీ జితేంద్రకుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని