రాహుల్‌ ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వ్యాఖ్యలపై ఈసీకి భాజపా ఫిర్యాదు

రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వ్యాఖ్యలపై భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Published : 02 Apr 2024 05:04 IST

దిల్లీ: రామ్‌లీలా మైదానంలో ఇండియా కూటమి సభలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ వ్యాఖ్యలపై భాజపా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌లతో కూడిన బృందం సోమవారం ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు దాఖలుచేసింది. రాహుల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేయాలని అందులో విజ్ఞప్తి చేసింది. మోదీపై అసత్య ఆరోపణలు చేసినందుకు జాతికి, ప్రధానికి రాహుల్‌ బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పేలా ఆదేశించాలని కూడా కోరింది. వ్యవస్థలు అన్నింటినీ గుప్పిట్లో పెట్టుకొని మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ద్వారా మోదీ లోక్‌సభ ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని ఆదివారం నాటి సభలో రాహుల్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

దిలీప్‌ ఘోష్‌, సుప్రియలకు ఈసీ వార్నింగ్‌

భాజపా ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకురాలు సుప్రియా శ్రీనేత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నుంచి వారి వ్యాఖ్యలను పర్యవేక్షిస్తామని వెల్లడించింది. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలకు గానూ దిలీప్‌ ఘోష్‌, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్‌పై సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టు పెట్టినందుకు గానూ సుప్రియా శ్రీనేత్‌కు ఇటీవల ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ నోటీసులపై ఇద్దరు నేతలూ వివరణ ఇచ్చారు. పరిశీలించిన ఈసీ  హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని