కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది.

Updated : 02 Apr 2024 05:31 IST

తిహాడ్‌ జైలుకు దిల్లీ సీఎం తరలింపు

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. ఈ కేసులో ఈ నెల 15 వరకూ జ్యుడిషియల్‌ కస్టడీ విధిస్తూ రౌజ్‌ అవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీ  ముగియడంతో సీఎం కేజ్రీవాల్‌ను సోమవారం కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.. ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదని తెలిపారు. ఆయనను జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరారు. ‘‘విచారణకు సీఎం సహకరించడం లేదు. ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్‌ పరికరాల పాస్‌వర్డ్‌లను చెప్పడం లేదు. కొన్ని రోజుల తర్వాత ఆయనను మళ్లీ కస్టడీలోకి తీసుకుంటాం. అప్పటిదాకా జ్యుడిషియల్‌ కస్టడీ విధించాలి’’ అని ఈడీ వాదించింది. ఇందుకు న్యాయస్థానం అంగీకరిస్తూ కేజ్రీవాల్‌కు 15 రోజుల కస్టడీ విధించింది. ఈ క్రమంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం సోమవారం సాయంత్రం తిహాడ్‌ జైలు-2కు తరలించారు. అక్కడ ఆయనకు ప్రత్యేక గది కేటాయించారు. ఈ సందర్భంగా పలువురు ఆప్‌ కార్యకర్తలు పార్టీ జెండాలు, ‘నేను కూడా కేజ్రీవాల్‌ను’ అనే రాసి ఉన్న టీ-షర్టులు ధరించి తీహాడ్‌ జైలు బయట ఆందోళనకు దిగారు. దీంతో జైలు రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

మోదీ చర్యలు దేశానికి మంచిది కాదు

కోర్టు లోపలికి వెళ్లే ముందు కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలు దేశానికి మంచిది కాదు’’ అని వ్యాఖ్యానించారు.
ఈడీ విచారణలో కేజ్రీవాల్‌ కీలక విషయాలను వెల్లడించారు. ‘‘ఈ కేసులో మరో నిందితుడైన విజయ్‌ నాయర్‌ తనకు రిపోర్టు చేయడని విచారణ సమయంలో కేజ్రీవాల్‌ తెలిపారు. మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌కు మాత్రమే అతడు నివేదించేవాడు’’ అని ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. ఈవెంట్స్‌ కంపెనీ ‘ఓన్లీ మచ్‌ లౌడర్‌ ’ సీఈవో విజయ్‌ నాయర్‌ను ఈ కేసులో 2022లోనే అరెస్టు చేశారు. ఆయన ఎప్పటి నుంచో ఆప్‌తో కలిసి పనిచేస్తున్నారు. దీనిపై ఓ మీడియా సంస్థ ఆతిశీని ప్రశ్నించగా.. ఆమె ఎటువంటి సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. గతంలో ఆప్‌ రాజ్యసభ ఎంపీ ఎన్‌డీ గుప్తా ఈడీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో ఒకసారి ఆతిశీ పేరును ప్రస్తావించారు. గోవా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఆమె పని చేశారని వెల్లడించారు.


జైల్లో రామాయణం, భగవద్గీత కావాలి

తనకు 15 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించిన నేపథ్యంలో కేజ్రీవాల్‌ కోర్టుకు కొన్ని అభ్యర్థనలు చేశారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది దరఖాస్తు సమర్పించారు. జైలులో చదివేందుకు తనకు మూడు పుస్తకాలు కావాలని కేజ్రీవాల్‌ కోరారు. రామాయణం, భగవద్గీత, జర్నలిస్టు నీరజా ఛౌదరీ రాసిన ‘హౌ ప్రైమ్‌ మినిస్టర్స్‌ డిసైడ్‌’ వంటి పుస్తకాలు జైల్లో అందుబాటులో ఉంచాలని కోరారు. అలాగే ఒక బల్ల, కుర్చీ, మందులు, డైట్‌ ప్రకారం ఆహారం అందించాలని అడిగారు. ఇప్పటికే ధరిస్తున్న లాకెట్‌ను కొనసాగించేందుకు అనుమతించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని